పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీల్ చైర్స్ పంపిణీ చేసిన కలెక్టర్ రాజా బాబు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోల్ లో బాల భవిత కేంద్రం ద్వారా చిన్నారులకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు.
గురువారం ఒంగోలు ప్రభుత్వ సర్వ జన ఆస్పత్రిలోని జిల్లా బాల భవిత కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు పాల్గొని ప్రత్యేక అవసరాలు కలిగిన 25 మంది చిన్నారులకు వీల్ ఛైర్స్ ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ, పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ముందుకు వచ్చి ఒక్కొక్క వీల్ చైర్ 12 వేల రూపాయలు విలువ చేసే 25 వీల్ చైర్స్ ను ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అందచేయడం సంతోషకరమన్నారు.
చిన్నారులకు వీల్ ఛైర్స్ అందించిన పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి జోనాధన్ ను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
జీజీహెచ్ లోని జిల్లా బాల భవిత కేంద్రం ద్వారా అంగవైకల్యం ఉన్న చిన్నారులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారన్నారు.
అంగవైకల్యం అనేది చాలా బాధాకరమని, అంగవైకల్యంతో పుట్టిన పిల్లల భవిష్యత్ ఏమిటి అనే విషయం పై తల్లిదండ్రులు బాధ పడుతుంటారని, అంగవైకల్యంతో పుట్టిన పిల్లలకు చిన్న వయస్సులోనే చికిత్స అందిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆయన అన్నారు.
చికిత్స తర్వాత ఎంతో మంది చిన్నారుల పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. చికిత్స తర్వాత అవసరమైన వారికి వీల్ ఛైర్స్, ఇతర ఉపకరణాలను జిల్లా బాల భవిత కేంద్రం ద్వారా అందిస్తుందన్నారు.
నేడు కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి అనుభవజ్ఞులైన డాక్టర్లు వైద్య సేవలు అందించడం జరుగుచున్నదని, ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకుని ఆర్ధిక భారం తగ్గించుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర రావు, జిల్లా బాల భవిత కేంద్రం అధికారి డాక్టర్ భగీరధి దేవి, ఒంగోలు సర్వజన వైద్యశాల పీడియాట్రిక్ విభాగం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ తిరుపతి రెడ్డి, బాల భవిత కేంద్రం ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సునీత, పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి జోనాధన్, రిమ్స్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఆర్ఎంఓ డా. మాధవి లత, జిజీహెచ్ చెందినా వివిధ విభాగాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

