జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శిగా పి. స్వరూప రెడ్డి.
విజయనగరంలోని గురజాడ అప్పారావు ప్రాంగణంలో ఉత్సాహబరిత వాతావరణంలో రెండు రోజులపాటు జరిగిన జనవిజ్ఞాన వేదిక 18వ రాష్ట్ర మహాసభలో చివరి రోజు 24 మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గం 75 మందితో రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతానికి చెందిన పి స్వరూప రెడ్డి జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
ఆయనను జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వివిధ మండలాల నాయకులు వివిధ సంఘాల నాయకులు రాజకీయ ప్రముఖులు అభినందించారు.
వైద్యులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు,జర్నలిస్టులు, కవులు, కళాకారులు తదితర రంగాలకు చెందిన మేధావులు ఈ సభలకు హాజరయ్యారు.
సోషల్ సైన్స్ తోనే సమాజం అభివృద్ధి చెందుతుందని అందుకు అనుగుణంగా జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని అభినందనీయమని ప్రముఖ రాజకీయ ,సామాజిక విశ్లేషకులు, మాజీ శాసన శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. ఒకవైపు శాస్త్రవిజ్ఞానము ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ అదే స్థాయిలో మూఢనమ్మకాలు, చాందస భావాలు, అందవిశ్వాసాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ శాస్త్ర విజ్ఞాన ఫలాలు సాధారణ ప్రజానీకానికి అందకపోవడమే ఇందుకు కారణమన్నారు.
ప్రముఖ విద్యావేత్త మాజీ శాసన మండలి సభ్యులు కె. ఎస్ . లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రాంతాల మధ్య అసమానతలు, విద్య, వైద్యము, ఆరోగ్యం, జీవన ప్రమాణాల్లో వెనుకబాటు
తనం పోయినప్పుడే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్రం విడిపోయి 11 సంవత్సరాలు అయినా అభివృద్ధి నోచు కోలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే ప్రాంతాల మధ్య సమతుల్యత సుస్థిరాభివృద్ధి మానవ అభివృద్ధి జరగాలన్నారు.
మహాకవి గురజాడ అప్పారావు నివాసాన్ని సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దాలని, గురజాడ పేరు మీద గురజాడ సాంస్కృతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, వందలాదిమంది ప్రతినిధులతో సైన్స్ వాక్ నిర్వహించారు. సైన్స్ వాక్ లో గురజాడ అడుగుజాడ జాతికి వెలుగు జాడ అని, శాస్త్ర పరిశోధనలకు తగిన నిధులు కేటాయించాలని, సైన్స్ బోధన భావ ప్రకటన స్వేచ్ఛ పై జరుగుతున్న దాడులను ఖండించాలని ప్లకార్డ్ల్ ప్రదర్శించారు
.విజ్ఞానం శాస్త్రీయత, అభ్యుదయ గేయాలతో కూడిన సాంస్కృతి కార్యక్రమాలు సభికులను ఆలోచింప చేశాయి.
ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు విఠపు బాలసుబ్రమణ్యం ,పి రఘువర్మ, ఎంవిఎస్ శర్మ, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసన మండలి సభ్యులు ఎం.గేయానంద్ ప్రధాన కార్యదర్శి కుర్ర రామారావు ,చెకుముకి ఎడిటర్ మాజీ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎ.రామచంద్రయ్య, యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు, ఏఐపిఎస్ఎన్ ప్రధాన కార్యదర్శి ఆశా మిశ్రా, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి. రామ్మోహన్, తెలంగాణ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్. రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి కె. రాజా, 25 జిల్లాలకు చెందిన జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు హాజరయ్యారు.
