అనకాపల్లి, జనవరి 29: అనకాపల్లి ఉత్సవ్ తేదీ:30,31.01.2026పురస్కరించుకుని జిల్లాలో నిర్వహించే వివిధ కార్యక్రమాలకు సంబంధించి పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఉత్సవాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం మరియు బెల్లం మార్కెట్ ప్రాంతాలను, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్ ఆధ్వర్యంలో ముత్యాలమ్మ పాలెం బీచ్, కొండకర్ల ఆవ ప్రాంతాల్లో బందోబస్తును పర్యవేక్షిస్తారు.
వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.
ఉత్సవ ప్రాంతాల్లో కదలికలను గమనించేందుకు సీసీటీవీ కెమెరాలు మరియు డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
ఎటువంటి నేరాలు, అల్లర్లు జరగకుండా నిరోధించేందుకు ఉత్సవ ప్రాంగణాల్లో భారీగా మఫ్టీలో పోలీసులను మోహరించారు. బందోబస్తు విధుల్లో ఉన్న అధికారులు మరియు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విధులు నిర్వహించాలని ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించి, ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా పోలీస్ యంత్రాంగం కోరుతోంది.
