గిద్దలూరులో బ్యాంకు ఉద్యోగుల నిరసన – ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలంటూ డిమాండ్.



 గిద్దలూరులో బ్యాంకు ఉద్యోగుల నిరసన – ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలంటూ డిమాండ్.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా : గిద్దలూరు.

       బ్యాంకు ఉద్యోగులపై రోజురోజుకూ పెరుగుతున్న పని భారాన్ని తగ్గించి, వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ( యు ఎఫ్ బి యు ) ఆధ్వర్యంలో గిద్దలూరు పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్ నాయకుడు రంగ ప్రసాద్ నేతృత్వంలో జరిగింది.ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి, అనంతరం గిద్దలూరు ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈనెల 23న చీఫ్ లేబర్ కమిషన్‌తో జరిగిన చర్చలు విఫలమవడంతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్‌బీఐ యూనియన్ లీడర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, 2015 నుంచి ఐదు రోజుల పని దినాల కోసం పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

 సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల ఉద్యోగులు అనారోగ్యానికి గురవుతున్నారని, యంత్రం కూడా హద్దు మించి పని చేస్తే పాడవుతుందన్న ఉదాహరణ ఇచ్చారు. ప్రస్తుతం 90 శాతానికి పైగా డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు తగిన విశ్రాంతి కల్పిస్తే మరింత ఉత్సాహంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని అన్నారు.యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ మాట్లాడుతూ, 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పటికీ భారతదేశ ప్రభుత్వ రంగ బ్యాంకులు బలంగా నిలబడ్డాయని గుర్తు చేశారు. ఎల్ ఐ సి , ఆర్.బి.ఐ, ఐ ఆర్ డి ఏ ఎల్ , ఎస్ ఈ బి ఐ, వంటి సంస్థల్లో ఇప్పటికే ఐదు రోజుల పని విధానం అమలులో ఉందని, బ్యాంకులకు మాత్రం ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు. 

ఈ డిజిటల్ యుగంలో ఐదు రోజుల పని విధానం ఎటువంటి సమస్య కాదన్నారు.సీఐటీయూ నాయకులు ఆవులయ్య మాట్లాడుతూ, కార్మికుల హక్కులను కాపాడే 28 చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా నాలుగు కొత్త కార్మిక చట్టాలను ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు. ఇది కార్మిక వర్గాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. ( యు ఎఫ్ బి యు ) చేపట్టిన ఈ ఉద్యమానికి సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

ఈ కార్యక్రమంలో గిద్దలూరు మరియు పరిసర ప్రాంతాల ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post