క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు/ఢిల్లీ, డిసెంబర్ 09: దేశవ్యాప్తంగా మొత్తం 4,597 పారిశ్రామిక పార్కులు ఉండగా, అందులో అత్యధికంగా 638 పారిశ్రామిక పార్కులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలోని పారిశ్రామిక పార్కుల వివరాలు కోరుతూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ఆయా రాష్ట్రాల విధానాలకు అనుగుణంగా వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయబడుతున్నాయని, పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడే విధంగా కేంద్ర ప్రభుత్వం, పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (DPIIT), ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలు ద్వారా కేంద్రం తన వంతు తోడ్పాటు అందిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు.
ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరిక మేరకు ఆంధ్ర ప్రదేశ్ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చెయ్యబడ్డ పారిశ్రామిక పార్కుల వివరాలను మంత్రి సభకు వెల్లడించారు. కేంద్ర మంత్రి రాతపూర్వకంగా పార్లమెంటుకు సమర్పించిన వివరాల ప్రకారం 638 పారిశ్రామిక పార్కులతో ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, 527 పారిశ్రామిక పార్కులతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 460 పారిశ్రామిక పార్కులతో రాజస్థాన్ మూడో స్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ (వరంగల్) సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లో మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పెరల్ పార్కుల ఏర్పాటు జరుగుతోందని మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు సహకారం అందించాలని ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర మంత్రిని కోరారు.
