రెండవ రోజు కొనసాగించిన ఏలూరు మున్సిపల్ స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్ల నిరాహార దీక్ష.


 రెండవ రోజు కొనసాగించిన ఏలూరు మున్సిపల్ స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్ల నిరాహార దీక్ష.

ఏ.పీ ఎన్జీవో అసోసియేషన్ తరఫున పూర్తి మద్దతు తెలుపుతున్న ఏలూరు అధ్యక్షులు శ్రీధర్ రాజు.

ఏలూరు,డిసెంబర్. 9: మున్సిపల్ స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయకపోవడం చాలా అన్యాయం అని ఏ.పీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఏలూరు అధ్యక్షులు శ్రీధర్ రాజు అన్నారు. ఏలూరు నగర పాలక సంస్థకు చెందిన స్కూల్ స్వీపర్లు,స్కూల్ శానిటేషన్ వర్కర్లు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్షలు చేపట్టారు. రెండవ రోజు నిరాహార దీక్షలను శ్రీధర్ రాజు ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాతిక ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్న స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లకు నెలకు రూ. 4 వేలు, 6వేలు జీతాలు చెల్లించడం చాలా అన్యాయం అన్నారు. వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ నెలకు 4000, 6000 అని అలాంటిది నెలంతా పని చేస్తే ఇచ్చే జీతం పెన్షన్ తో సమానమా?అని ఆయన ప్రశ్నించారు.తక్షణమే స్కూల్ స్వీపర్లు,శానిటేషన్ వర్కర్లకు జీవో నెంబర్ 7 ప్రకారం రూ. 15,000 కనీస వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లు తమ జీతాల పెంపుదల కోసం, సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆందోళనకు ఏ.పీ ఎన్జీవో అసోసియేషన్ తరఫున పూర్తి మద్దతు తెలుపుతున్నామని అన్నారు. ఆయన ముందుగా దీక్షాపరుల మెడలో ఎర్రని రిబ్బన్లు వేసి నిరాహార దీక్షలను ప్రారంభించారు. వారితోపాటు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు డి.రత్నబాబు, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకురాలు కే.విజయలక్ష్మిలు కూడా దీక్షల ప్రారంభంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి యూనియన్ గౌరవాధ్యక్షులు బి. సోమయ్య అధ్యక్షత వహించారు. ఈ నిరాహారదీక్షల కార్యక్రమానికి ఎస్.కృష్ణవేణి, జి.రాజు, ఆంతోని, లక్ష్మీ ప్రియాంక,పి. దుర్గ, బాల బాలాజీ, లక్ష్మణరావు, చిట్టెమ్మ, శ్రీలేఖ, లీలారాణి, రమాదేవి, తిరుపతమ్మ, భద్రాదేవి, మాధవి, సువర్ణ కుమారి, నాగమల్లేశ్వరి, పెద్దింట్లమ్మ, రమణమ్మ, అప్పల రత్నం, వెంకటరమణ, ప్రమీల,లక్ష్మి తదితరులు నాయకత్వం వహించారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పవర్ పేటలో గల స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) కి వినతిపత్రం సమర్పించారు. 


Post a Comment

Previous Post Next Post