మాతృ మరణాలు అరికట్టాలి జిల్లా కలెక్టర్.



 మాతృ మరణాలు అరికట్టాలి జిల్లా కలెక్టర్.

 ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా ఒంగోలు, జన్మనిస్తూ ఏ తల్లీ మరణించరాదని, గర్భవతి సమయంలో అందించ వలసిన అన్ని రకాల వైద్య సేవలు, చికిత్సలు, పరీక్షలు వైద్యాధికారులు సకాలంలో అందించి మాతృ మరణాలను అరికట్టాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన మాతృ మరణాల పై ఎండిఆర్ (మెటర్నల్ డెత్ రెవ్యూ) కమిటీ సమావేశం నిర్వహించి జిల్లాలో ఈ సంవత్సరం గత ఆరు నెలల కాలంలో జరిగిన మాతృ మరణాల పై స‌మీక్షించారు. ఆరు నెల‌ల కాలంలో ముగ్గురు గర్భవతులు మృతి చెందిన‌ట్లు అధికారులు వివ‌రించగా, ఆ ముగ్గురు గర్భవతుల మృతికి గల కార‌ణాల‌పై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ప్ర‌భుత్వ వైద్యాధికారుల అభిప్రాయాల‌ను తెలుసుకున్నారు. ఆయా ఆసుప‌త్రుల్లో ఉన్న వ‌స‌తులు, వైద్యుల గురించి ప్ర‌శ్నించారు. మాతృ మ‌ర‌ణాల‌ను నివారించ‌డానికి, స్త్రీ గ‌ర్భం దాల్చిన ద‌గ్గ‌ర‌నుంచి, ప్ర‌స‌వం అయ్యే వ‌ర‌కూ అన్ని విధాలా జాగ్ర‌త్త‌లు తీసుకొనేలా చూడాల‌ని, ప్ర‌తీనెలా క్ర‌మం త‌ప్ప‌కుండా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి, అవ‌స‌ర‌మైన మందులు, పోష‌క ప‌దార్ధాలు, త‌గిన స‌ల‌హాలు సూచ‌ల‌ను అందించాల‌ని జిల్లా కలెక్టర్, వైద్యాదికారులను ఆదేశించారు. మ‌ర‌ణం త‌రువాత చేసేది ఏమీ ఉండ‌ద‌ని, సాధ్య‌మైనంత వ‌ర‌కు చిత్త‌శుధ్దితో కృషి చేసి, ఆధునిక వైద్య‌ స‌దుపాయాలు, త‌మ అనుభ‌వం, వైద్య ప‌రిజ్ఞానాన్ని వినియోగించి ప్రాణాల‌ను కాపాడాల‌ని అన్నారు. త‌మ వ‌ల్ల కాద‌నిపిస్తే, వెంట‌నే నిర్ణ‌యం తీసుకొని వీలైనంత త్వ‌ర‌గా పై వైద్యశాలకు పంపించాల‌ని సూచించారు.   

        ఈ స‌మావేశంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ వెంకటేశ్వర రావు, డిఐఓ డా కమలశ్రీ, రిమ్స్ గైన‌కాల‌జీ హెడ్ డాక్ట‌ర్ సంధ్యా రాణి, మత్తు మందు విభాగము హెడ్ డా. జయసుందరం, జిల్లా ఎన్టిఆర్ వైద్య సేవల కోఆర్డినేటర్ డా. హేమంత్, ప‌లువురు వైద్యాధికారులు, ప్రయివేటు వైద్యశాల ప్ర‌తినిధులు తదిత‌రులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post