తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగాయి.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి చెప్పారు. మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా తీసుకువస్తున్న సంస్కరణలే దీనికి నిదర్శనం అన్నారు. శుక్రవారం టంగుటూరు మండలం కొణిజేడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయులు - తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ( మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ -3.0) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు వీరికి ఘన స్వాగతం పలుకుగా ముందుగా స్కూల్ ప్రాంగణంలోని సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలవేసి వీరు పుష్పాంజలి ఘటించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్, పుస్తక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మంత్రి, కలెక్టర్ కూర్చుని వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా హాజరైన తల్లిదండ్రులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో కొత్తగా రూ.92.5 కోట్లతో అదనపు తరగతి గదులను వివిధ పాఠశాలలకు మంజూరు చేశామన్నారు. త్వరలోనే ఈ పనులు కూడా ప్రారంభమవుతాయి అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందేలా ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేశామని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని, సమగ్ర అంశాలతో పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు, యూనిఫారాలు, బూట్లు ఇస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పాఠశాలల్లో క్రమంగా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వారి ఆరోగ్య పరిరక్షణ పైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. ' లీప్ ' యాప్ ద్వారా ఆయా విషయాలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. వచ్చే వందరోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేయడం ద్వారా పరీక్షల్లో మెరుగైన ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా సహకరించాలని ఆయన సూచించారు.
కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల పురోగతి గురించి ప్రత్యక్షంగా ఉపాధ్యాయులను అడిగి తెలుసుకునేందుకు ఇలాంటి సమావేశాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను కూడా తల్లిదండ్రులు ఈ సందర్భంగా ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభిస్తుందన్నారు. స్మార్ట్ విద్యా బోధనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఉపాధ్యాయులకు కూడా విద్యార్థులను సొంత బిడ్డలుగా భావించి వారి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు. అభ్యున్నతి దిశగా విద్యార్థులను తీసుకెళ్లడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుందని కలెక్టర్ చెప్పారు.
డీఈవో కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యాశాఖ తరఫున జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ బడిలోనే చదువుకొని ఈ స్థాయికి వచ్చానన్నారు. ప్రభుత్వ బడులపై తల్లిదండ్రులు విశ్వాసం ఉంచాలని ఆమె సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్లా బ్రహ్మయ్య మాట్లాడుతూ గత ఏడాది సాధించిన ప్రగతిని వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్, కొండపి నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ కళావతి, సమగ్ర శిక్ష ఏపీసి అనిల్ కుమార్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ వెంకట్రావు, కమిటీ కోఆప్షన్ సభ్యులు రామా కామయ్య, ఇతర అధికారులు, స్థానిక ప్రముఖులు, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు. గత ఏడాది పదవ తరగతి, ఇంటర్మీడియట్లో తెలుగు సబ్జెక్టులో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు తెలుగు టీచర్ ఝాన్సీ లక్ష్మీబాయి తన సొంత డబ్బులతో చేసిన ఆర్థిక సహాయాన్ని విద్యార్థులకు ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ అందించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి, కలెక్టర్, ఇతర అధికారులు భోజనం చేశారు. దీనికి ముందుగా కందులూరు పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ - టీచర్స్ కార్యక్రమంలోనూ మంత్రి, కలెక్టర్ పాల్గొన్నారు.


