రోడ్డు భద్రత నియమాల పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత – అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధిజిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి పట్టణం, డిసెంబర్:06 అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల్లో ట్రాఫిక్ భద్రతపై అవగాహన పెంచడం లక్ష్యంగా, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు అనకాపల్లిలో భారీ స్థాయిలో రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి సబ్-డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం.వెంకట నారాయణ నాయకత్వం వహించారు.
స్థానిక ఆదిత్య డిగ్రీ కాలేజ్, హిమశేఖర్ డిగ్రీ కాలేజ్, శ్రీకన్య డిగ్రీ మరియు స్ఫూర్తి డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో కలిసి పెరుగు బజార్, చిన్న నాలుగు రోడ్ల జంక్షన్ నుండి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్డు భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రజలకు సందేశం అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించే విధంగా ప్రతిజ్ఞ చేశారు.
అధికారుల ముఖ్య సూచనలు:
ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అత్యవసరం: యువత, విద్యార్థులు రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తే అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.
హెల్మెట్ – సీటు బెల్ట్ తప్పనిసరి: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కారు డ్రైవర్లు సీటు బెల్ట్ వినియోగించడం ద్వారా ప్రమాదాల తీవ్రత తగ్గుతుందని వివరించారు.
అతివేగం & ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదకరం: వేగం నియంత్రణలో ఉంచాలని, మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపరాదని కఠినంగా హెచ్చరించారు.
బాధ్యతాయుత పౌర ప్రవర్తన: రోడ్డు భద్రతపై విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అవగాహన కల్పించి “రోడ్డు ప్రమాద రహిత అనకాపల్లి” లక్ష్య సాధనలో భాగస్వాములవ్వాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు అమలు చేస్తున్న చర్యలకు ప్రజలు అన్ని విధాలుగా సహకరించాలని అధికారులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై శేషగిరిరావు మరియు ట్రాఫిక్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు మరియు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

