గంజాయి అక్రమ కేసులో నిందితుడికి 3 సంవత్సరాలు 9 నెలల కఠిన కారాగార శిక్ష ₹5,000/- జరిమానా: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.
అనకాపల్లి (నర్సీపట్నం రూరల్), డిసెంబర్ :05 నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో నమోదు చేసిన గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడు రిజేష్ కి 3 సంవత్సరాలు 9 నెలల కఠిన కారాగార శిక్షతో పాటు ₹5,000/- జరిమానా విధిస్తూ, జరిమానా చెల్లించనట్లయితే అదనంగా 1 నెల సాధారణ జైలు శిక్ష విధిస్తూ విశాఖపట్నం 1వ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం. వెంకటనారాయణ తీర్పు వెలువరించారు.
శిక్ష పడిన నిందితుడు రిజేష్, 29 సంవత్సరాలు
చెరువిలపూతం వీడు, కోణైల్ గ్రామం, పరవూర్ (పోర్ట్), కొల్లం జిల్లా, కేరళ రాష్ట్రం.
2022 మార్చి 24 ఉదయం 10 గంటలకు, నర్సీపట్నం రూరల్ ఎస్సై ఎస్.రమేష్ కి అందిన పక్కా సమాచారంపై గురందరపాలెం – దరి నగరం వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నర్సీపట్నం వైపు నుండి వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. రెండో వ్యక్తి పారిపోయాడు.
అదుపులోకి తీసుకున్న వ్యక్తి బ్యాగులో 4 కేజీల గంజాయి లభించడంతో అతన్ని మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేశారు.
దర్యాప్తులో నిందితుడు చింతపల్లి ఏజెన్సీ ప్రాంతం నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించే ఉద్దేశంతో రవాణా చేస్తున్నట్లు బయటపడింది.
అప్పటి ఎస్సై ఎం.రామారావు సమగ్ర దర్యాప్తు చేసి, న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.ఎస్.ఎన్.వి.ప్రసాద్ రావు బలమైన వాదనలు వినిపించగా, సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు పై శిక్షలను ఖరారు చేసింది.
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఈ తీర్పును అనకాపల్లి పోలీసుల కఠిన కృషికి నిదర్శనంగా అభివర్ణించారు. కేసు దర్యాప్తు చేసిన ఎస్సై ఎం.రామారావు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, నర్సీపట్నం రూరల్ పోలీస్ సిబ్బంది, కోర్టు మానిటరింగ్ సెల్‌కు ఆయన అభినందనలు తెలిపారు.
