భగవద్గీత కంఠస్థ పోటీల్లో ప్రతిభ చూపిన టి.నరసాపురం గృహిణి మండం వెంకట మహాలక్ష్మి.
ఏలూరుజిల్లా.టి.నరసాపురం,క్రైమ్ 9మీడియా:
టి నరసాపురం మండలానికి చెందిన గృహిణి భగవద్గీత కంఠస్థ పోటీల్లో ప్రతిభ చూపింది. కర్ణాటక రాష్ట్రం మైసూరు అవధూత దత్త పీఠం లో జరిగిన పోటీల్లో విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా, టి.నరసాపురానికి చెందిన మండం వెంకట మహాలక్ష్మి ఏడాదిగా భగవద్గీతను నిత్యం పారాయణ చేస్తున్నారు. ఇటీవల అవధూత దత్త పీఠం ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్ధ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మహాలక్ష్మి పాల్గొని భగవద్గీతను అలవోకగా ఉచ్ఛరిస్తూ ఉత్తమ ప్రతిభ చూపారు. విజేతగా నిలిచి గోల్డ్‌మెడల్ సాధించారు. గీతా జయంతి సందర్భంగా మైసూరు ఆశ్రమంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా గోల్డ్‌మెడల్‌ను, సర్టిఫికెట్‌ను సోమవారం అందుకున్నారు. ఈ సందర్భంగా గోల్డ్ మెడల్ గ్రహీత మహాలక్ష్మి మాట్లాడుతూ భగవద్గీతను సరిగ్గా అర్ధం చేసుకుని, ఆచరణలో పెట్టగలిగితే మానసిక, శారీరిక ప్రశాంతత లభిస్తుందన్నారు. మనిషిని ఉద్దరించడానికే భగవంతుడు తన వాక్కు ద్వారా భగవద్గీతను అందించారని, గీతాపఠనం జీవన విధానాన్ని మార్చే సాధనమన్నారు. మనిషితో పాటు సమాజాన్ని సైతం ఉన్నత విలువలతో ముందుకు తీసుకు వెళ్లగలిగే దిక్సూచి భగవద్గీత అని, ప్రతీ ఒక్కరూ భగవద్గీత పారాయణం చేయాలన్నారు. ఏడాది పాటు నిత్యపఠనం ద్వారానే తనకు విజయం చేకూరిందని, ఈ క్రమంలో తనలో సైతం ఎంతో మార్పును సాధించగలినట్లు చెప్పారు. భగవద్గీత కంఠస్థ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల టి.నరసాపురం గ్రామపెద్దలు, ప్రముఖులు మహాలక్ష్మిని అభినందించారు.
