ఏలూరు, నవంబర్, 29 : సమాచార హక్కు చట్టం సామాన్యుని చేతిలో బ్రహ్మాస్త్రమని ఏలూరు తహసీల్దార్ గాయత్రి చెప్పారు. స్థానిక గొల్లాయిగూడెం సెంటర్లో శనివారం సమాచారహక్కు చట్టంపై ప్రజలకు అవగాహనా కార్యక్రమాన్ని తహసీల్దార్ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గాయత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వివరాలు, నిధులు వినియోగం, ప్రజలకు తమకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలలోని సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద పొందవచ్చన్నారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో పౌర సమాచార అధికారి ఉంటారని, ఆ కార్యాలయంలో ప్రజలు తమకు అవసరమైన సమాచారాన్ని కోరుతూ దరఖాస్తు చేస్తుకోవలసి ఉంటుందన్నారు. దరఖాస్తు రుసుముగా 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, దారిద్య రేఖకు దిగువ కలిగిన వ్యక్తులు తమ రేషన్ కార్డు ను నకలును దరఖాస్తుకు జతచేస్తే దరఖాస్తు రుసుము చెల్లించవలసిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయం అధికారులు సదరు సమాచారం అందించేందుకు సమాచార రుసుము మాత్రం అందరూ చెల్లించాల్సి ఉంటున్నదన్నారు. అనంతరం సమాచార హక్కు చట్టం పై గొల్లాయిగూడెం నుండి వంగాయగూడెం మీదుగా జ్యూట్ మిల్లు వరకు అవగాహన ర్యాలీ ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ రెవిన్యూ అధికారి నాగరాజు, రెవిన్యూ, ఏలూరు నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు.
Add

