ఏలూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయానికి మరింత ఊతం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు, నవంబర్, 3 : ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రకృతి వ్యవసాయం రానున్న కాలంలో ఎంతో అవసరమైందని, ఇకపై రసాయన ఎరువులు లేకుండానే మనం ప్రకృతి ఆధారిత పద్ధతుల్లో పంటలు పండించాలని జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాష చెప్పారు. కొత్తగా ఎంపికైన T-ICRPsకు 5 రోజులపాటు జరగనున్న సమగ్ర శిక్షణ కార్యక్రమం ఏలూరులోని జిల్లా వ్యవసాయ కార్యాలయం పరిధిలో సోమవారం హబీబ్ భాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా హబీబ్ భాషా మాట్లాడుతూ ప్రస్తుతం మనం తింటున్న ఆహారం ఎక్కువగా కెమికల్ వ్యవసాయం ద్వారా వస్తోందని, అందువల్ల ప్రజల్లో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, దీనిని నివారించడానికి ప్రకృతి వ్యవసాయమే మార్గమన్నారు.
ప్రకృతి వ్యవసాయం విభాగం డి.పి.ఎం. బి. వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే దృక్పథంతో 142 మంది నూతన T-ICRPs (ట్రైనీ ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్) లను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ శిక్షణలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, ప్రకృతి వ్యవసాయ 9 సూత్రాలు, ప్రకృతి వ్యవసాయ ఆచారాలు, అలాగే వివిధ ప్రకృతి వ్యవసాయ నమూనాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. అదనంగా, ప్రకృతి వ్యవసాయ ఇన్పుట్ల తయారీపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చి, రైతు స్థాయిలో స్వయంగా తయారీ చేసి వినియోగించే విధానాలను వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా పాల్గొన్న T-ICRPsకు ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు అందించబడ్డాయి.
ఈ సమావేశానికి రాష్ట్ర కార్యాలయం నుండి ప్రభాకర్, జిల్లా ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ (DPMU) సిబ్బంది, అలాగే శిక్షణలో పాల్గొంటున్న T-ICRPs హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత, రైతుల శిక్షణ, జీవావరణ సంరక్షణ, ఆరోగ్యకర ఆహారం వంటి అంశాలపై విశదీకరించి అవగాహన కల్పించారు. అధికారులు, ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామ స్థాయిలో మరింత విస్తరింపజేసి ప్రతి రైతు దీని నుండి లాభపడేలా చేయాలని పిలుపునిచ్చారు.
