అనారోగ్యమే - నిజమైన పేదరికం ముఖ్యమంత్రి చంద్రబాబు.


 అనారోగ్యమే  - నిజమైన పేదరికం ముఖ్యమంత్రి చంద్రబాబు.

* అందుకే ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం.

* హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ మా నినాదం.

* శంకర ఐ ఫౌండేషన్ సేవలు నిరుపమానం.

* పెదకాకాని శంకర ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

* పేదలకు నిస్వార్థంగా సేవ చేసే సంస్థలకు సహకరిస్తామని సీఎం హామీ.

గుంటూరు జిల్లా, నవంబర్ 9: అనారోగ్యమే నిజమైన పేదరికమని, అందుకే ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని శంకర కంటి ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఐదు దశాబ్ధాలుగా శంకర ఆస్పత్రి పేదలకు ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోందని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో నడుస్తున్న శంకర కంటి ఆస్పత్రి లో నూతన భవన నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని, నిస్వార్థంగా సేవలు చేసే ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. 

దృష్టిని ప్రసాదిస్తూ మానవాళికి అద్భుతమైన సేవ.

‘మానవ సేవనే మాధవ సేవ అని నమ్ముతుంది కాబట్టే...కంచి పీఠం దేశ వ్యాప్తంగా కంటి ఆస్పత్రులు స్థాపించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన కంచి పీఠం ఆది నుంచి హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడుతోంది. అందులో భాగంగానే ఆది శంకరాచార్యులు దేశంలోని నాలుగు ప్రాంతాల్లో నాలుగు పీఠాలను స్థాపించారు. హిందూ ధర్మాన్ని తిరిగి బలమైన శక్తిగా మలిచారు. 1977లో ప్రారంభమైన శంకర కంటి ఆస్పత్రి సామాన్యులకు సైతం నేత్ర చికిత్సలను అందుబాటులోకి తెచ్చింది. త్వరలో జరిగే స్వర్ణోత్సవ కార్యక్రమానికి నేను హాజరవుతాను. 50 ఏళ్ల వ్యవధిలో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 14 ఐ హాస్పిటల్స్‌ నిర్మించడం సాధారణ విషయం కాదు. ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు, 70 లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయడం గొప్ప విషయం. ఈ ఆస్పత్రుల్లో రోజుకి సగటున 750 ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 2,268 మంది సిబ్బంది పనిచేస్తుంగా 2,576 పడకలు ఉన్నాయి. ఇంత గొప్ప సేవా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న శంకర ఆస్పత్రిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. 2003 నుంచి గుంటూరులోని శంకర కంటి ఆస్పత్రి సేవలు అందిస్తోంది. ఈ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఇప్పటికి 4 లక్షలకు పైగా ఉచిత కంటి శస్త్రచికిత్సలు, 9 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. 300 పడకల సామర్థ్యంతో, రోజుకు 2,500 నుంచి 3,000 వరకు రోగులకు సేవలు అందిస్తున్నారు. రెయిన్‌బో ప్రోగ్రామ్ ద్వారా ప్రత్యేకంగా పిల్లల కంటి ఆరోగ్యంపై దృష్టి పెట్టడాన్ని అభినందిస్తున్నాను. శంకర యొక్క గ్రామీణ సేవా ప్రాజెక్ట్ ‘గిఫ్ట్ ఆఫ్ విజన్’ కింద ఇప్పటివరకు 32,000కు పైగా కంటి శిబిరాలు నిర్వహించడం వారి సేవా గుణానికి నిదర్శన’మని సీఎం చంద్రబాబు అన్నారు. 

పేదలకు సేవ చేసే సంస్థలకు ఎల్లప్పుడూ సహకారం.

‘జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య ఆకాంక్షించినట్టు పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదు. ఆరోగ్యం లేకుండా డబ్బు, హోదా, ఆస్తులు, బంగ్లాలు, కార్లు ఉన్నా ఉపయోగం ఏమీ లేదు. అందుకే ప్రజారోగ్య సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. వినూత్నంగా యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తెస్తున్నాం. ప్రతి ఒక్కరికీ రూ. రెండున్నర లక్షల ఆరోగ్య భీమా, ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు విలువైన వైద్య సేవలు ఈ పాలసీ కింద అందిస్తాం. టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నెర్వ్ సెంటర్ ‘సంజీవని’ కేంద్రాలు త్వరలో రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తాం. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల హెల్త్ రికార్డులు ఆన్ లైన్ లో పెడుతున్నాం. ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో ఆరోగ్యాంధ్ర ప్రదేశ్‌కు ప్రయత్నాలు చేస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నాం. ప్రజల ఆరోగ్యం కాపాడడానికి శంకర కంటి ఆస్పత్రి సేవలను స్వాగతిస్తున్నాను. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలతో కలిసి పనిచేయడానికి రాష్ట్రం ప్రభుత్వం సిద్దంగా ఉంది. పేదలకు సేవ చేసే ఇలాంటి సంస్థలకు మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 

కంచి కామకోటి పీఠం సేవలు అద్వితీయం.

‘ఆధ్యాత్మికంగా భక్త జనావళి శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారు. ధర్మం, జ్ఞానం, సేవ మూల సిద్ధాంతాలుగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ పీఠాన్ని కొనసాగిస్తున్నారు. సామాజికంగాను పేదలను, ఆపన్నులను ఆదుకునేందుకు కంచి కామకోటి పీఠం విశేషంగా పని చేస్తోంది. సామాన్యులకు సైతం నేత్ర చికిత్సలు అందుబాటులోకి తెచ్చిన శంకర ఐ హాస్పటల్... 1977లో ఈ సేవా ఉద్యమాన్ని ప్రారంభించింది. త్వరలో స్వర్ణోత్సవంలో అడుగుపెడుతోంది. సేవే పరమావధిగా భావించే శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ మార్గదర్శకత్వంలో శంకర ఫౌండేషన్ మరింత ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని సీఎం అన్నారు. అంతకుముందు ఆస్పత్రిలోని శంకర ఆస్పత్రిలోని పలు విభాగాలను సీఎం చంద్రబాబు సందర్శించి వాటి వివరాలు తెలుసుకున్నారు. శంకర ఐ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సర్జరీలు, ఐ బ్యాంక్ ద్వారా చేస్తున్న సేవలను ముఖ్యమంత్రికి నిర్వాహకులు వివరించారు. అనంతరం సీఎం చంద్రబాబుకు శాలువా తంజావూరు పెయింటింగ్ ను ఆస్పత్రి నిర్వాహకులు బహుకరించారు.

Post a Comment

Previous Post Next Post