క్రైమ్ 9మీడియా ప్రతినిధి. శరత్. ఏలూరు, అక్టోబర్, 29 : రానున్న రెండురోజులలో జిల్లా అంతటా పెద్దఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి బుధవారం తుఫాన్ అనంతరం పారిశుద్ధ్య, సహాయక కార్యక్రమాలు , నష్టం నివారణ అంచనాలపై అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో భారీవర్షాలు సంభవించాయని, వర్షాలు కారణంగా గ్రామాలు, పట్టణాలు, నగరాలలో వరదనీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. ఎక్కడా చెత్త లేకుండా శుభ్రం చేయించాలని, త్రాగునీరు కలుషితం కాకుండా క్లోరినేషన్ చేయించి సరఫరా చేయాలన్నారు. త్రాగునీటి పైపు లైన్లు, డ్రైనేజి పైపు లైన్లు కలవకుండా చూడాలన్నారు. తుఫాన్ కారణంగా దెబ్బ తిన్న పంటల నష్టాలను వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక వెంటనే సమర్పించాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవనాలు, పశుసంవర్థకం, ఆక్వా నష్టాలకు సంబంధించి సంబంధింత సిబ్బంది వెంటనే ఎన్యూమరేషన్ ప్రారంభించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, ఫీవర్ సర్వే చేయాలనీ, యాంటీ వీనం, డయేరియా, వైరల్ జ్వరాలకు సంబంధించి మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో స్టాక్ ఉండేలా చూడాలన్నారు. తుఫాన్ కారణంగా దెబ్బ తిన్న రోడ్లు, కాజ్ వే లు, కల్వర్టు లు, విద్యుత్ స్థంబాలు, పాఠశాల , ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ చెరువులు, కాల్వలు, నదులు గట్లను పరిశీలించి, బలహీన గట్ల పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
తుఫాన్ అనంతరం జిల్లా మొత్తం పారిశుద్ధ్య, సహాయక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన - జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
