ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన దరఖాస్తులు మరల రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు, అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యు అధికారి శ్రీ చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీ కుమార్, శ్రీ జాన్సన్, శ్రీమతి విజయజ్యోతి లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన దరఖాస్తులు మరల రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించడమే కాక, వారి సమస్యను సావధానంగా విని నిబంధనల మేరకు సానుకూల విధానంలో పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. సమస్య పరిష్కారం అయిన తరవాత పరిష్కార విధానం, దరఖాస్తుదారుల సంతృప్తి చెందారా.. లేదా అన్న విషయాన్నీ అధికారులు స్వయంగా ఫోన్ చేసి తెలుసుకోవాలని, అప్పుడే ప్రభుత్వ సేవలపై ప్రజలకు అనుకూల అభిప్రాయం ఏర్పడుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి కచ్చితంగా సంబంధిత శాఖకు సంబంధించిన జిల్లా అధికారి రావాలని, ఏదైనా కారణాల వలన వారు రాలేని పక్షంలో ముందస్తు అనుమతి తీసుకుని సెకండ్ లెవెల్ అధికారి రావలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

