రైల్వే దొనకొండ దగ్గర మిసైళ్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్న బీడీఎల్ - ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి 1,600 మందికి ఉపాధి.
దొనకొండలో మిసైళ్ల తయారీ - రూ.1,200 కోట్లతో బీడీఎల్ భారీ ప్రాజెక్ట్
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు )
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రక్షణ రంగంలో మరో పెద్ద అడుగు వేయబోతోంది. ప్రతిష్ఠాత్మక సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్.
ఇప్పుడు రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దొనకొండలో భారీ స్థాయి సమీకృత ఆయుధ వ్యవస్థ, ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. రూ.1,200 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కానుంది.
బీడీఎల్ సంస్థ మొదటి దశలో రూ.650 కోట్లను, రెండో దశలో రూ.550 కోట్లను వెచ్చించనుంది. మొత్తం రూ.1,200 కోట్లతో ఈ యూనిట్ స్థాపన జరగనుంది. ప్రొపెల్లెంట్ మోటార్లు, సమీకృత ఆయుధ వ్యవస్థల తయారీ, టెస్టింగ్ సదుపాయాలు ఇందులో ఉంటాయి. ప్రాజెక్ట్ అమలు పూర్తి స్థాయిలో జరిగితే రాష్ట్రం రక్షణ పరికరాల తయారీలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉంది.
ఉపాధికి కొత్త అవకాశాలు: ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి, పరోక్షంగా మరో 1,000 మందికి ఉపాధి లభించనుంది. మొత్తం 1,600 మంది ఈ ప్రాజెక్ట్ ద్వారా లబ్ధి పొందబోతున్నారు. తయారీ యూనిట్‌తో పాటు 200 ఎకరాల్లో ఉద్యోగుల కోసం ఆధునిక టౌన్‌షిప్ ఏర్పాటు చేయనుంది. 600 కుటుంబాలకు నివాస సదుపాయాలు కల్పించేందుకు బీడీఎల్ ప్రతిపాదించింది.
భూమి కేటాయింపు - ప్రభుత్వ ప్రణాళికలు: ప్రాజెక్ట్ కోసం 1,400 ఎకరాల భూమి అవసరమని బీడీఎల్ ప్రభుత్వం ముందుంచింది. దీనిలో ప్రభుత్వం తన దగ్గర ఉన్న 317 ఎకరాలను ఎకరాకు రూ.7.73 లక్షల చొప్పున కేటాయించనుంది. మిగిలిన భూములను సాధ్యమైనంత త్వరగా సేకరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. మొత్తం 1,346.67 ఎకరాలను ఈ ప్రాజెక్ట్ కోసం ఇవ్వడానికి ప్రభుత్వం ప్రాథమికంగా అంగీకరించింది.
సమీకృత ఆయుధ వ్యవస్థలు: సెన్సర్లు, కమ్యూనికేషన్ పరికరాలు, క్షిపణులు, తుపాకులు వంటి వివిధ ఆయుధ వ్యవస్థలను సమన్వయపరిచే ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ తయారీ ఈ యూనిట్‌లో ప్రధానంగా జరుగుతుంది. అంతరిక్ష ప్రయోగాలకు, సైన్యానికి అవసరమైన వెయ్యి టన్నుల వరకు పేలోడ్‌లను మోయగల రాకెట్ మోటార్లను కూడా తయారు చేయనుంది. ఇది భారత రక్షణ రంగానికి అత్యాధునిక సాంకేతికతను అందించే సంస్థగా నిలవనుంది.
నిర్మాణ షెడ్యూల్: బీడీఎల్ డీపీఆర్ ప్రకారం, 2026 మార్చి నాటికి అన్ని అనుమతులు పొందనుంది. అనంతరం నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. 2028 మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేసి, అదే ఏడాది సెప్టెంబరు నాటికి ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. యంత్రాల అమరిక జూన్ 2028లో జరుగుతుంది.
మౌలిక వసతులు - విస్తృత ప్రణాళిక: యూనిట్ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా బీడీఎల్ ప్రతిపాదనలో ఉన్నాయి.
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే నుంచి యూనిట్ వరకు 8 కిలోమీటర్ల రెండు లేన్ల రహదారి.
రోజుకు 25 వేల కిలోవాట్ల విద్యుత్ సరఫరా.
రోజుకు 2 వేల కిలోలీటర్ల నీటి సదుపాయం.
ఆంధ్రప్రదేశ్‌కు రక్షణ రంగంలో గుర్తింపు: ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కల్యాణి స్ట్రాటజీస్ సిస్టమ్స్ లిమిటెడ్ రూ.2,400 కోట్లతో అత్యాధునిక రక్షణ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు దొనకొండలో బీడీఎల్ యూనిట్ కూడా వస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ రక్షణ పరిశ్రమలో దేశవ్యాప్తంగా ప్రముఖ కేంద్రంగా అవతరించనుంది. రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్ స్థానం మరింత బలపడుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు.
