బాణాసంచా ప్రమాదాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
రెవిన్యూ, పోలీసు, ఫైర్, తదితర శాఖల అధికారులతో తనిఖీ బృందాలను ఏర్పాటుచేసి బాణాసంచా అనధికార, తయారీ,నిల్వ, అమ్మకం, భద్రతా చర్యలపై ప్రత్యేక నిఘా పెట్టాలి.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలీకాన్ఫెరెన్స్.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు, అక్టోబర్, 9 : జిల్లాలో ఎటువంటి బాణాసంచా ప్రమాదాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లాలో బాణాసంచా ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలు, బాణాసంచా అనధికార తయారీ, నిల్వలు, అమ్మకాల నియంత్రణపై బుధవారం సాయంత్రం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె. ప్రతాప్ శివ కిషోర్ లతో కలిసి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా బాణాసంచా ప్రమాదాలు జరగకుండా రెవిన్యూ, పోలీసు, ఫైర్, తదితర శాఖల అధికారులతో తనిఖీ బృందాలను ఏర్పాటుచేసి, జిల్లాలో లైసెన్స్ కలిగిన బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకాల షాపులను తనిఖీ చేసి, అక్కడ భద్రతా ఏర్పాట్లు, పరిసరాలలో నివాసిత గృహాలను పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు. అనధికార బాణాసంచా తయారీ, నిల్వలు, అమ్మకాలపై నిఘా పెట్టి వాటిని నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలకు ఆస్కారం ఉండే అగ్ని, షార్ట్ సర్క్యూట్ వంటివి జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్త చర్యలను దుకాణాదారులకు తెలియజేసి, వాటిని వారు ఏర్పాటుచేసుకునేలా చూడాలన్నారు. బాణాసంచా అమ్మే షాపులకు తాత్కాలిక లైసెన్స్ లు జారీ సమయంలో ఆయా షాపుల షాపు యజమునులు షాపుల వద్ద ప్రమాద నివారణకు ఖచ్చితంగా చర్యలు తీసుకునేలా చూడాలని, సదరు షాపుల వద్ద ప్రమాదాల నివారణకు ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ దీపావళి పండుగ జరుపుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర ప్రాంతాల నుండి ఏలూరు జిల్లాకు రవాణా అయ్యే బాణాసంచా పై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ప్రజా రవాణా వాహనాలలో బాణాసంచా తరలించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ., ప్రైవేట్ రవాణా వాహనాలను చెక్ పోస్ట్ ల వద్ద తనిఖీలు నిర్వహించాలని, అనధికారికంగా బాణాసంచా రవాణా చేసేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ గతంలో ఊరు శివారు ప్రాంతంలో బాణాసంచా తయారీకి అనుమతులు ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో నివాసిత గృహాలు వచ్చివుంటాయని , అటువంటి సమయంలో బాణాసంచా తయారీ కేంద్రాలను ఆ నివాసిత ప్రాంతాల నుండి తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం ప్రదేశాలలో ఆకస్మిక ప్రమాదాల సమయంలో భద్రతకు నీరు, ఇసుక వంటివి అందుబాటులో ఉండేలా వారికి తెలియజేయాలన్నారు. బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలు ఒకేచోట ఉన్న సమయంలో వాటిని దూరంగా ఉంచేలా యజమానులకు తెలియజేయాలన్నారు.
డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, డిఎంహెచ్ఓ డా. పి .జె. అమృతం, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Add

