జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. మంత్రి డాక్టర్ డోల.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
భారీ వర్షాల వలన జిల్లాలో ఎలాంటి ప్రాణ, పశు, ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్, డోలా.బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. గురువారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆయన జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణలతో కలిసి జిల్లాలోని పరిస్థితిపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. మండల స్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ప్రత్యేక అధికారులుగా ఉన్న వారితోనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల వలన ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. వర్షాలు తగ్గేంతవరకు ఇదే స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు చెప్పానన్నారు. వర్షాల వలన ఎలాంటి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా సిబ్బందిని పూర్తిస్థాయిలో నిమగ్నం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్లను ఆయన ఆదేశించారు.
చెట్లు కూలి రవాణాకుఅంతరాయం కలిగినా, విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగినా తక్షణమే పునరుద్ధరించేలా సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆయన చెప్పారు.
వాగులు పొంగుతుంటే ప్రజలెవరూ అటువైపు వెళ్లకుండా రెవెన్యూ, పోలీసు సిబ్బందితో నిరంతరం గస్తీ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని, క్లోరినేషన్ విషయంలో ఏమాత్రంనిర్లక్ష్యంవహించినా
సహించబోనని మంత్రి స్పష్టం చేశారు.
అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
గ్రామాల్లోని వర్షపు నీటిని చెరువుల్లోకి మళ్ళించాలని, ఒక చెరువు నిండితే మరో చెరువులోకి నీటిని మళ్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.
జిల్లాలోని పంట నష్టంపై తనకు రెగ్యులరుగా నివేదికలు పంపించాలని మంత్రి చెప్పారు. పశువులను మేత కోసం తీసుకువెళ్లి, వాగుల్లో చిక్కుకునే అవకాశం ఉన్నందున కాపరులెవరూ బయటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు.
మత్స్యకారులు కూడా సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలని, వర్షం తగ్గుముఖం పట్టిందని ఎవరైనా వెళ్తే తక్షణమే వెలుపలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగాఎదుర్కొనేలా జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమై ఉందన్నారు.
కలెక్టరేట్లోనూ, డివిజన్లు, మండల స్థాయిలోనూ ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
తనతో పాటు జాయింట్ కలెక్టర్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులకు అవసరమైన సూచనలు చేశామన్నారు.
పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని, అవసరమైన మందులు, రేషన్ సరుకులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ బి.చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
