వ్యవసాయ శాఖ, రైతాంగం అభివృద్ధిపై జగన్ ఓపెన్ డిబేట్‌కి సిద్ధమా?
*సవాల్ విసిరిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మార్పులను రాష్ట్ర ప్రజలముందు బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం
జగన్ పాలనలో రైతులు నరకం చూశారు
కూటమి ప్రభుత్వంపై జగన్ ఆరోపణలు చేయడం విచిత్రంగా ఉంది
రైతు పేరు చెప్పడానికి జగన్ అర్హుడు కాదు.. రైతు కష్టాన్ని దోచుకొని, రైతు కన్నీటి మీద రాజకీయాలు చేసిన వ్యక్తి జగన్
వైసీపీ పాలనలో రైతాంగాన్ని మోసం చేసి, నేడు తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న జగన్
కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో రైతుల పక్షాన నిలుస్తుంది... రైతు కష్టం వృథా కాకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు
విజయవాడ, సెప్టెంబర్ 10:రైతాంగం అభివృద్ధి, వ్వయసాయ శాఖలో చేసిన సంస్కరణలు, రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఓపెన్ డిబేట్‌కు సిద్ధమా? అని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత జగన్‌కు సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం రైతుల కోసం ఏం చేస్తుందో, వ్వయసాయ రంగంలో తీసుకొచ్చిన మార్పులు ఏవో రాష్ట్ర ప్రజలముందు బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఒక ప్రకటనలో తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతులకు మోసపూరిత వాగ్దానాలు తప్ప ఇంకేమీ ఇవ్వలేదని, మద్దతు ధరలు కోత పెట్టి, ఇన్సూరెన్స్ డబ్బులు ఆపేసి, పంటలు అమ్మకానికి రాకుండా చేసిన వైసీపీ వైఫల్యాలను ప్రజలు మరచిపోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు తోడుగా నిలబడి విత్తనాల నుంచి పంట అమ్మకాల వరకు పూర్తి సహకారం అందిస్తోందని అన్నారు. ఎరువులు, విత్తనాలు సమయానికి అందిస్తూ, పంటలకు రుణ సౌకర్యం కల్పిస్తూ, రైతు కుటుంబాలను రక్షించేలా పథకాలను అమలు చేస్తోందన్నారు. దీనిపై ధైర్యం ఉంటే జగన్ పబ్లిక్ డిబేట్‌కు రావాలని సవాల్ విసిరారు. ఎవరికి రైతుల పట్ల నిజమైన నిబద్ధతుందో ప్రజలే తీర్పు చెబుతారు అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
రైతాంగానికి ఊరట కల్పించే విధంగా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ, ఎరువుల సరఫరా, పంట కొనుగోళ్లు, మద్దతు ధరలు, రుణమాఫీ వంటి కీలక అంశాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వంపై జగన్ ఆరోపణలు చేయడం విచిత్రమని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్, తన ఐదేళ్ల పాలనలో రైతాంగాన్ని మోసం చేసి, నేడు తప్పుడు ఆరోపణలు చేసి మళ్లీ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతు సంక్షేమం అంటే జగన్ కు ఏమాత్రం పట్టులేదని ఆయన పాలనలోనే స్పష్టమైందన్నారు. ఎరువుల కొరత, నల్లబజారు, కొనుగోలు కేంద్రాల వద్ద నిర్లక్ష్యం, పంట బీమా చెల్లింపులలో మోసాలు ఇవన్నీ జగన్ పాలనలోనే జరిగాయని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల కోసం రాత్రింబవళ్ళు శ్రమిస్తుంటే, జగన్ మాత్రం ప్రతిదాన్నీ కుతంత్రం చేసి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతుకు అందుతున్న ప్రతి సహాయం జగన్ కంటకంగా మారిందని మంత్రి అన్నారు.
ధరల స్థిరీకరణ నిధి పేరుతో 3 వేల కోట్లు ఏర్పాటు చేశామని, 7,800 కోట్లు ఖర్చు పెట్టామని జగన్ చెబుతున్నారు. అసలు మార్కెట్‌లో ధరలు పడిపోకపోయినా 7,800 కోట్లు ఎక్కడికి పోయాయి? రైతులకు ఒక్క పైసా ఉపయోగం లేకుండా ఆ డబ్బు ఎవరెవరి జేబుల్లోకి వెళ్లింది? ఇవన్నీ పచ్చి అబద్ధాలు. వైసీపీ హయాంలో రైతుల ఉత్పత్తుల కొనుగోలు అనే మాటే లేదు. నిజంగా కొనుగోలు చేసి ఉంటే ఏ రైతు నుండి, ఏ పంటను, ఏ ప్రాంతంలో కొనుగోలు చేశారో కాగితాలతో చూపించగలరా? లేకపోతే అబద్ధాల గజిబిజి నుంచి బయటపడగలరా?” అని సవాల్ విసిరారు. HD బర్లీ పొగాకు ధర పడిపోతే 271 కోట్లు వెచ్చించి 20,000 మిలియన్ కిలోలు కొనుగోలు చేసేందుకు నిర్ణయించి, ఇప్పటికే 16,000 మిలియన్ కిలోలు కొనుగోలు చేసామని తెలిపారు. ఇంకా మిగిలిన 4000 మిలియన్ కిలోలను కూడా కొంటామని, ఇంకో 60వేల మిలియన్ కిలోలను ప్రైవేట్ వర్తకుల ద్వారా కొనుగోలు చేయించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 3 సందర్భాలలో టొమాటో ధర పడిపోతే, 4599 మెట్రిక్ టన్నుల టొమాటో పంటను కొనుగోలు చేసి 11.25 కోట్లు రైతులకు చెల్లించామని అన్నారు.
ఉల్లి ధరల విషయంలో మీరు ముసలి కన్నీరు కారుస్తున్నారు. మా ప్రభుత్వం మద్దతు ధరగా రూ.1200 ప్రకటించింది. ఈనాడు పత్రికలో వెలువడింది. కానీ మీరు ఒకవైపు రూ.1200 మద్దతు ధర అని చెబుతారు, మరోవైపు రూ.300కే కొనుగోలు జరుగుతోందని అంటారు... అసలు మద్దతు ధర విధానం మీకు తెలుసా? తెలుసుకునే తెలివి ఉన్నదా? మద్ధతు ధర కన్నా మార్కెట్ లో అమ్ముడుపోయినటువంటి విలువ తగ్గితే ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. మార్కెట్ లో 300 రూ ట్రేడ్ అయితే మిగతా 900రూ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ప్రాథమిక జ్ఞానం కూడా లేని మీరు అసలు మాజీ ముఖ్యమంత్రివేనా?” అని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో రైతుల ధాన్యం కొనుగోలు చేసినా డబ్బులు ఇవ్వలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బకాయి పడ్డ నగదును రైతులకు అందచేశామని, రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి, 24 గంటల్లోపే నగదు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత మాది అని మంత్రి గుర్తుచేశారు. 2016లో ఉల్లి ధరలు పడిపోతే 7723 మంది రైతులనుండి 2.77 లక్షల క్వింటాళ్ళు కొనుగోలు చేసి 7కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామని అన్నారు. 2018లో మరొక సారి 9740 మంది రైతుల నుండి 3.48 లక్షల క్వింటాళ్ళ ఉల్లి కొనుగోలు చేసి 6.45 లక్షలు చెల్లించామని, 2020 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వంలో ఉల్లి ధరలు పడిపోతే, నామ మాత్రంగా క్వింటాకి రూ.770/-లు మద్దతు ధర ప్రకటించి, ఏ ఒక్కరి దగ్గరా ఉల్లి కొనుగోలు చేయకుండా, రైతులను మోసం చేసారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం క్వింటాకి రూ.1200/-లు మద్దతు ధర ప్రకటించి, ఇచ్చిన మాటకు కట్టుబడి, అదే ధరకు ఉల్లి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
కోకో ధరలు పడిపోతే 3776 మంది రైతుల నుండి కేజీకి రూ.50/- అదనంగా ఇచ్చి కొనుగోలు చేసాము. ఇందుకు గాను 11.8 కోట్లు చెల్లించాము. తోతాపురి మామిడి ధర పడిపోతే, 51వేల మంది రైతుల నుండి 4.3 లక్షల టన్నుల మామిడి కొనుగోలు చేసి కేజీకి రూ.4/-లు చొప్పున 171 కోట్లు చెల్లించాము. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మిర్చీకి క్వింటాకి రూ.11,781/-లు మార్కెట్ జోక్యపు ధరను కల్పించాము. ప్రభుత్వం నుండి హామీ లభించటంతో మార్కెట్లో మిర్చీ ధర స్థిరీకరించబడి రూ.11,781/-లు కంటే అధికంగా ట్రేడ్ అయింది. దీంతో MIS పధకం అమలు చేయాల్సిన అవసరం రాలేదు. 2017లో మిర్చీ ధరలు పడిపోతే ప్రభుత్వం 55 వేల మంది రైతులకు క్వింటాకి రూ.1500/- చొప్పున 130 కోట్లు చెల్లించాము. అదే మీ ప్రభుత్వం హయాంలో 2020 సంవత్సరంలో మార్కెట్ ధర 12000/-లు ఉంటే మద్దతు ధర రూ.7000/-లు ప్రకటించి కొనడానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ఒక కార్పొరేట్ సీఎంకి సామాన్యుని తాలూకా కష్టాలు , సామాన్యులు ఉపయోగించే వస్తువుల తాలూకా రేట్లు తెలియాలి అనుకోవడం హస్యాస్పదం. ఉల్లి ధర పడిపోయింది బహిరంగ మార్కెట్లో కేజీ 34 రూపాయలు ఉందని, ధనవంతులు ఉపయోగించే బిగ్ బాస్కెట్ లో ధరలు కనిపిస్తున్నాయి గాని సామాన్యుడు వాడేటటువంటి రైతు బజార్లో ఈ రోజు ఉల్లి ధర ఎంత ఉందనేది మాట్లాడి ఉంటే ప్రజలు సంతోషించేవారు.
కేంద్ర ప్రభుత్వం యూరియా వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పటం వలన పక్క రాష్ట్రాలలో యూరియా కొరత వలన పలు రాష్ట్రాలలో ఆందోళలనలు చేయడం వలన ఏపీలో కూడా యూరియా దొరకదని భయంతో మూడు సీజన్లకు వాడాల్సిన యూరియాను ఒకే సారి రైతులు కొనుక్కోవాలి అన్న అభద్రతాభావం, యూరియా దొరకటం లేదని ఫేక్ పోటోలు పెట్టి రైతులు అదే నిజమనుకొని రబీ సీజన్ కు కావల్సిన యూరియాను ముందుగానే కొనుక్కొవాలని భయాన్ని వైసీపీ నేతలు సృష్టించారు. ఇటీవల ఒక నెల డ్రై స్పెల్ రావడం తరువాత విస్తారంగా ఒకే సారి వర్షాలు కురవడం వలన ఆగస్ట్ నెలలో ఒకే సారి రాష్ట్ర వ్యాప్తంగా వరి పంటను వేయడంతో ఒక 10 రోజులు రైతులు యూరియా దొరకదని భయభ్రాంతులకు గురయ్యేలా వైసీపీ వారు వాతావరణాన్ని సృష్టించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి రావలసిన కేటాయింపు యూరియా కంటే అధిక మొత్తంలో అదనంగా యూరియాను కేటాయించుకొని జిల్లాలకు సరఫరా చేసి రైతులకు యూరియాను అందుబాటులో ఉంచాం. నేటికి యూరియా కొరత తీరిపోయింది. రబీ సీజన్ కు కావల్సిన 9.3 లక్షల మెట్రిక్ టన్నులను ముందస్తుగానే సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. ఎరువులను బ్లాక్ మార్కెట్ కు తరలించే ఉద్ధేశం కూటమి ప్రభుత్వానికి లేదు, గతంలో వైసీపీ నేతలు బ్లాక్ మార్కెట్ కు యూరియాను తరలించడంతో అందరూ అదే విధంగా వ్యవహరిస్తారని భావించడం వారి అజ్ఞానానికి నిదర్శనం అని అన్నారు. ఈ ప్రభుత్వ కాలంలో సహకార సంస్థలకు 70 % , ప్రైవేట్ వ్యాపారులకు 30 % యూరియాను కేటాయింపులు జరిపాం. గత ప్రభుత్వంలో 50-50 శాతం నిష్పత్తిలో యూరియాను పంపిణీ చేసి బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించారని దుయ్యబట్టారు.
ఆర్ఎస్కేలు మీ ప్రభుత్వంలో ఉన్న దాని కంటే ఈ ప్రభుత్వంలోనే ఆర్ఎస్కేలు ద్వారా పిఎసిఎస్ ద్వారా అధికంగా ఎరువులు వీటి ద్వారా అమ్మకాలు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ప్రైవేట్ వ్యాపారుల దగ్గర లంచాలు తీసుకొని ఉంటారని, మీ సమయం లో కన్నా ఈ ప్రభుత్వ సమయంలోనే ఆర్ఎస్కే ల ద్వారా పిఎసిఎస్ ల ద్వారా అధికంగా ఎరువులు సప్లై చేసామన్న విషయాన్ని గ్రహించి మాట్లాడితే మాట్లాడితే మాజీ సీఎం జగన్ కు గౌరవం దక్కేది అని అన్నారు. పంట నష్టం వస్తే సీజన్ లోపే ఇన్సూరెన్స్ ద్వారా నష్టపరిహారం ఇప్పించడం జరిగిందని మాట్లాడుతున్నారు ఈ రోజు క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో ఇన్ని అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు వచ్చాయంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలే కారణం. అన్నదాత సుఖీభవ పథకానికి 7 లక్షల మందిని తగ్గించాం అని అంటున్నారు, అర్హులైన ప్రతి ఒక్కరికి అన్నదా సుఖీభవ ద్వారా నగదును అందచేశాం. మిగిలిన వారికి తిరిగి ఇచ్చేందుకు ప్రక్రియ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రాని కౌలు రైతులు, ఆర్ ఓ ఎఫ్ ఆర్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం 20 వేలు అందచేస్తుదన్న విషయాన్ని గుర్తించుకోవాలని అన్నారు. లాస్ట్ లో 2019 తరువాత ఏ ఒక్క సంవత్సరానికి రభి కి ఇన్స్యూరెన్స్ ఇవ్వలేదు . 2022 -23 ఖరీఫ్ తరువాత ఖరీఫ్ కి ప్రీమియం కట్టకుండా ఎగనామం పెట్టి రైతులని జగన్ మోసం చేశాడు.
రాష్ట్రంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమంగా తరలిస్తున్న యూరియాను కట్టడి చేసి, నిందితులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేస్తున్నామని... ఆయా చిత్రాలను తన సొంత పత్రికలో వేసుకొని ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేయడం విచిత్రంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు పారదర్శకంగా ఎరువులు పంపిణీ జరిగేలా చర్యలు చేపడుతుంటే అబద్ధపు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవడం జగన్ వంకర బుద్ధికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు నిన్న చేపట్టిన అన్నదాత పోరులో రైతులే లేరని, రైతులు జగన్ ను, వైసీపీ ని మర్చిపోయారని అన్నారు. గత ప్రభత్వంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని, ఎవరైనా ఏ విషయంపైనా ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో వేయడం, లేదా విచక్షణారహితంగా దాడులు చేయడం ఆ కారణంచే ఎవరు బయటకు వచ్చి వారి గొంతును వినిపించుకునే వారు కాదని, నేడు స్వేచ్ఛగా ప్రజలు జీవిస్తున్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు తూచా తప్పకుండా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వ పాలనను చూసి తట్టుకోలేక కుళ్లి కుళ్లి ఏడుస్తున్న జగన్ హంద్రీ-నీవా కాలువలో దూకితే వైపీపీ కి మోక్షం లభిస్తుందని అన్నారు.
