మైక్రో బ్రేవరీల(బీర్ల తయారీ యూనిట్) ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ ను కట్టడి చేస్తానంటూనే.... ఇంటి వద్దకే డ్రాఫ్ట్ బీర్ పాలసీ నిర్ణయం సిగ్గు చేటు
రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన ఏఐవైఎఫ్ రాష్ట్ర బృందం
ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపు
వలి ఉల్లా ఖాద్రీ/కల్లూరు ధర్మేంద్ర
ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి
TELANGAANA రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మైక్రో బ్రేవరీల(సూక్ష్మ బీర్ల తయారీ యూనిట్) ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఆబ్కారీ కార్యాలయంలో రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ ఖురేషి కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ/కల్లూరు ధర్మేంద్రలు సంయుక్తంగా మాట్లాడుతూ
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ప్రజల అభ్యున్నతి పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)తోపాటు కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, ఆదిలాబాద్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధి.....టీసీయూఆర్ పరిధిలోని జీహెచ్ఎంసీతో పాటు బోడుప్పల్, జవహర్ నగర్, ఫీర్జాదిగూడ, నిజాంపేట, బడంగ్ పేట, బండ్లగూడ జాగీర్, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లలో ఎక్సైజ్ శాఖ ద్వారా మైక్రో బ్రేవరీల ఏర్పాటు నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మైక్రో బ్రేవరీల ఏర్పాటు వలన విద్యార్థులు, యువతపై సామాజిక ప్రభావం, మద్యం అధిక వినియోగం, హింస, అశాంతి,నియంత్రణ లేకపోవడం, ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమౌతాయని వారు ఆవేదన వ్యక్తంచేశారు.ఇప్పటికే రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు ఉన్నాయని, మైక్రో బ్రేవరీలు కార్పొరేషన్ స్థాయిలో ఏర్పాటు అయితే ఇప్పటికే గల్లీకో వైన్ షాప్, వందలాది బెల్ట్ షాపులు ఉన్న పరిస్థితుల్లో ఈ బీర్ల తయారీ వల్ల చిన్న చిన్న కిరాణా షాపుల్లో సైతం బీర్ల అమ్మకాలు జరపడంతో పాటు దుకాణాదార్లు అత్యాశకు పోయి బీర్లను కల్తీ చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.
అంతేకాకుండా ఈ లీజుదార్లు సిండికేట్ గా మారి ఆయా ప్రాంతాల్లో వీళ్లు తయారు చేసినటువంటి బీర్లనే అమ్మే విధంగా అక్రమ రిటైల్ షాప్ లను నడిపే అవకాశాలు ఉన్నాయన్నారు.
దీని మూలంగా తెలంగాణలో మద్యం ఏరులై పారుతుందన్నారు. ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రెవెన్యూ కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టే ఈ మైక్రో బ్రేవరీల నోటిఫికేషన్ ను రద్దు చేయాలని ఏ ఐ వై ఎఫ్. తెలంగాణ రాష్ట్ర సమితిగా డిమాండ్ చేస్తున్నామన్నారు.
తక్షణమే మైక్రో బ్రేవరీల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి. సత్య ప్రసాద్,శ్రీమాన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్. బాల కృష్ణ,శివకుమార్, రాష్ట్ర సమితి సభ్యులు షేక్ మహమూద్, కళ్యాణ్,మధుకర్, వెంకటేష్, రాజ్ కుమార్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
