రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టండి.
*కబ్జాకు గురైన చెరువులు, గెడ్డలు, ప్రభుత్వ స్థలాలను రక్షించండి.
*వరహాల గెడ్డను రక్షించండి.
*వీలైతే ఒకసారి నెల్లి చెరువును పరిశీలించండి.
భూ సమస్యలు పరిష్కరించండి.
స్మశానాల కబ్జాలను తొలగింపు చర్యలు చేపట్టండి.
క్షేత్రస్థాయిలో పర్యటిస్తే రెవిన్యూ సమస్యలు కోకొల్లలు.
రెవెన్యూ సమస్యల వలన సామాన్యులు సతమతమవుతున్నారు.
ప్రభుత్వ ఆస్తులను రక్షించాలని పార్వతీపురం సబ్ కలెక్టర్ ను కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
పార్వతీపురం డివిజన్లో గాడి తప్పిన రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ పార్వతీపురం మన్యం జిల్లా చైర్మన్ వంగల దాలి నాయుడు, ఎస్సీ సెల్ చైర్మన్ కోలా కిరణ్ కుమార్, మండల అధ్యక్షులు తీళ్ల గౌరీ శంకరరావు తదితరులు పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆర్. వైశాలితో పార్వతీపురం డివిజన్లోని రెవెన్యూ సమస్యలపై చర్చించారు. వేలాదిమంది భూ సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. కార్యాలయాలు చుట్టూ తిరిగిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా రైతుల బాధలు వర్ణనాతీతమన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే అసలైన సమస్యలు దృష్టికి వస్తాయన్నారు. సామాన్యుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మ్యుటేషన్లు మొదలుకొని తారు మారైన సర్వే నెంబర్లు, భూమల సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయన్నారు. పార్వతీపురంలో జిరాయితీ భూముల సర్వే నెంబర్లు వేసి ప్రభుత్వ భూములు కబ్జా చేసే విష సంస్కృతి ఉందన్నారు. వీఆర్వో స్థాయి మొదలుకొని తాసిల్దార్ స్థాయి వరకు ప్రజలు సమస్యలతో బాధపడుతున్నారన్నారు. తక్షణమే రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టాలన్నారు. పార్వతీపురం పట్టణంతోపాటు డివిజన్లో కోట్లాది రూపాయలు విలువైన చెరువులు, గెడ్డలు తదితర సాగునీటి వనరులు కబ్జాకు గురయ్యాయి అన్నారు. చెరువు పక్కన ఉన్న జురాయితి పొలం సర్వే నెంబర్ వేసి చెరువులను రిజిస్టర్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయన్నారు. పార్వతీపురంలో బిళ్ళబంద, దేవుడి బంద, కామయ్య బంధం, గోపసాగరం, పాత్రుడు గారి కోనేరు, బోటు వారి చెరువు, లక్ష్మణ నాయుడు చెరువు, నెల్లిచెరువు, కోదు బంద, లంకెల చెరువు ఇలా దాదాపు చెరువులన్నీ కబ్జాకు గురయ్యాయి అన్నారు. కొంతమంది ప్రభుత్వ చెరువులు స్థలాల్లో లేఅవుట్లు వేసి విక్రయించారన్నారు. దాదాపు చెరువుల్లో పక్క భవనాలు వెలిశాయన్నారు. వీలైతే ఒకసారి నెల్లిచెరువును పరిశీలించాలన్నారు. సబ్ డివిజన్లో స్మశానాలు సైతం కబ్జాకు గురయ్యాయి అన్నారు. రెవిన్యూ సిబ్బంది, అధికారుల వైఫల్యం వలన సామాన్యులు సతమతమవుతున్నారన్నారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసిన సంఘటనలు లేకపోలేదు అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఒకరి భూమి మరొకరి ఖాతాలో చేరిపోతాయాన్నారు. తక్షణమే తగు చర్యలు చేపట్టి ప్రజలకు రెవిన్యూ సమస్యలు లేకుండా చూడాలన్నారు. పట్టణ మెయిన్ రోడ్డులో ప్రవహిస్తున్న వరహాలు గెడ్డ ఆక్రమణలకు గురైందన్నారు. వరహాలు గడ్డపై ఉన్న ఆక్రమణలు తొలగించాలన్నారు. ఈ సందర్భంగా ఆమెకు వినతి పత్రాన్ని అందజేశారు.
