ఎయిడ్స్ పై అవగాహనకు 5 కె మారథాన్ రెడ్ రన్ -DMHO డా. పి.జె.అమృతం.





ఎయిడ్స్ పై అవగాహనకు 5 కె మారథాన్ రెడ్ రన్ -DMHO  డా. పి.జె.అమృతం. 


అవగాహన, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. పి.జె.అమృతం పిలుపునిచ్చారు.


ఏలూరు,సెప్టెంబరు 12: స్థానిక వట్లూరు సర్.సి.ఆర్. రెడ్డి మహిళా కళాశాల నుండి శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ 2025-26, ఐఇసి మారథాన్ - 5 కె రెడ్ రన్ ర్యాలీని, ఎర్ర బెలూన్లు ఎగురవేసి, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. పి.జె.అమృతం, సెట్ వేల్ సిఇవో కె.యస్. ప్రభాకర రావులు సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీ జిల్లా కలెక్టరేటు వద్ద గల ఇండోరు స్టేడియం వరకు చేరింది.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పి.జె. అమృతం మాట్లాడుతూ నివారణ ద్వారానే ఎయిడ్స్ వ్యాధిని సమాజం నుంచి తరిమివేయగలమన్నారు. జిల్లాలో హెచ్ఐవి కేసులు పెరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి, యువతకు ఈ వ్యాధి నివారణపై అవగాహన కలిగించడానికి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మద్దతుగా నిలవడానికి మారథాన్ 5 కే రెడ్ రన్ ను నిర్వహించామని తెలిపారు. దీనిని కేవలం ఒక వ్యాయామ కార్యక్రమంగా కాకుండా, ఎయిడ్స్ పై అవగాహనకు ఒక సాధనంగా చూడాలని పిలుపు ఇచ్చారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపవద్దని, ప్రేమా ఆప్యాయతలను పంచాలని అన్నారు. మిగిలిన వ్యాధులు వలె ఇది కూడా ఒక వ్యాధి అని తెలిపారు. రక్త మార్పిడి, శస్త్ర చికిత్సల సమయంలో ఎయిడ్స్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. హెచ్ఐవి పరీక్షలు నిర్వహించడానికి సంచార సమీకృత సలహా, పరీక్ష కేంద్రం (మొబైల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగు అండ్ టెస్టింగు సెంటరు) ఈ మొబైల్ వ్యాను ద్వారా హెచ్ఐవి ప్రబలత అధికంగా గల ప్రాంతాలలో హెచ్ఐవి పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని చెప్పారు. హెచ్ఐవి సంబంధిత సమాచారం కోసం జాతీయ హెల్ప్ లైను నెంబరు 1097 ను సంప్రదించాలని కోరారు. 

సెట్ వేల్ సిఇవో కె.యస్. ప్రభాకర రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెచ్ఐవి, ఎయిడ్స్ మరియు దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మంచి దేహదారుడ్యం కోసం వ్యాధి నిరోధక శక్తి పెంపుదల కోసం రోజు ప్రతి రోజు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ కొంతసేపు వ్యాయాయం చేసి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు

ర్యాలీలో ఆర్ ఐవో ప్రభాకర్, దిశ క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజరు జి .ఆదిలింగం.దిశ క్లినికల్ సర్వీ్వేలెన్స్ ఆఫీసరు హరినాధ్ కుమార్, ప్రోగ్రామ్ అసిస్టెంటు మరియు గణాంకాధికారి సామార్ల విజయలక్ష్మి, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు, రెడీక్రాస్ నర్సింగు విద్యార్థులు,యన్జీవో సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ట్రాన్స్ జెండర్లు,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post