అంతర్జాతీయ కార్మిక చట్టాల ప్రకారం రోజుకి 8 పని గంటలు మాత్రమే ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రోజుకు 13 గంటలు పని విధానాన్ని పెంచుతూ రాష్ట్ర శాసనసభలోను, శాసనమండలిలోను చేసినబిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు అనగా 26-09-2025న, కొండపల్లి యం సిపిఐ మండల కార్యాలయం వద్ద MCPI, AICTU మరియు UYFI ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగినది.
ఈ కార్యక్రమానికి కామ్రేడ్ కలకోటి బసవయ్య అధ్యక్షత వహించగా, కామ్రేడ్స్ మర్రెడ్డి వెంకటరెడ్డి,ఉమ్మడి కృష్ణాజిల్లా కార్యదర్శి గొల్లపూడి ప్రసాద్,AICTU కన్వీనర్ వల్లెపు లక్ష్మీనారాయణ,UYFI కన్వీనర్ కాసాని గణేష్ బాబు లు ప్రసంగించారు.
అనేక త్యాగాల ద్వారా సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని 13 గంటలకు పెంచుతూ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి తీర్మానించడం కార్మికుల హక్కులను కాలరాయటమేనని నాయకులు అన్నారు. ఇది చట్ట రూపం దాల్చితే కార్మికుల శ్రమదోపిడీ మరింత పెరిగి శాస్త్రీయంగా కార్మికులకు లభించవలసిన విశ్రాంతి సమయం కోల్పోవడం జరుగుతుంది అంటూ, దానితో కార్మికులు అనారోగ్యం పాలు కావడానికి, ఆయిష్షు తగ్గించడానికి ప్రధాన కారణం అవుతుందని అన్నారు.
అలాగే కార్మికుల సృజనాశక్తి కోల్పోవడం, దానితో నైపుణ్యత, అలాగే ఉత్పత్తి మీద దాని ప్రభావం తీవ్రంగా పడుతుందని అన్నారు. అంతేగాక విశ్రాంతి సమయం తగ్గటం వలన యాక్సిడెంట్లు పెరగటానికి అవకాశం ఉంటుందని అన్నారు.
8 గంటల పని దినం అమలు చేస్తే మూడు షిఫ్టులలో కార్మికులు పనిచేస్తారు. అదే 12 గంటలు లేక 13 గంటలు ఒక షిఫ్ట్ కు పనిగా నిర్ణయం చేస్తే ఒక షిఫ్ట్ లో పని చేసే కార్మికులు ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని, ఇప్పటికే దేశం నిరుద్యోగ సమస్యలతో సతమతమవుతుంటే మరింత మంది నిరుద్యోగ సైన్యంలో చేరతారని అన్నారు.
మరోవైపు పెట్టుబడిదారుల లాభాల విపరీతంగా పోగుబడతాయని, శ్రమజీవుల కొనుగోలు శక్తి క్షీణిస్తుందని, దానితో మార్కెట్లో మాంద్యం దీర్ఘకాలంలో ఏర్పడుతుందని, దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందని అన్నారు.
10 గంటల పెంపు వల్ల పెట్టుబడిదారుల పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షిస్తుందని చెబుతున్న పాలకవర్గాలు ఒక విధంగా రాష్ట్ర శ్రామికవర్గ శ్రమ దోపిడీకి ద్వారాలు చేర్చినట్లు అవుతుందని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కరీముల్లా, బోస్, అరుణ క్రాంతి, కలకోటి రత్నం, బాబు తదితరులు పాల్గొన్నారు.
