అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు, వంట సామగ్రి పంపిణీ.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, జులై 15 :
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన, పరిశుభ్రమైన పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) ఆధ్వర్యంలో బుధవారం పలాస ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు, వంట పాత్రలను ఆమె పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు అంగన్వాడీ కేంద్రాలు కీలకమని పేర్కొన్నారు. పోషకాహార పంపిణీతో పాటు పరిశుభ్రమైన వాతావరణంలో వంటలు తయారయ్యేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి అవసరమైన సదుపాయాలను దశలవారీగా అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ విడతలో మందస మండలంలోని 176 అంగన్వాడీ కేంద్రాలకు, అలాగే పలాస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలోని 189 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు, వంట పాత్రలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. వీటి వినియోగంతో వంట ప్రక్రియ మరింత సులభతరంగా, పరిశుభ్రంగా సాగడంతో పాటు చిన్నారులకు సకాలంలో పోషకాహారం అందించేందుకు దోహదపడుతుందని ఆమె తెలిపారు.
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, సూపర్‌వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


