సమాజ సేవలో అగ్రగామి బర్రి జోగారావు.. తెలుగు జాతికి విశిష్ట సేవలు.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస: శ్రీకాకుళం జిల్లా అక్కుపల్లి గ్రామానికి చెందిన బర్రి జోగారావు సామాజిక, విద్యా, సాంస్కృతిక, సేవా రంగాల్లో విశేష కృషి చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. స్వర్గీయ బర్రి బైరాగి–అచ్చమాంబ దంపతుల ద్వితీయ సంతానమైన జోగారావు భిలాయ్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసి భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూనే ప్రజాసేవను జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు.
భిలాయ్‌లో శ్రీ కల్యాణ రామాలయ నిర్మాణం, ప్రవాసాంధ్ర పాఠశాల అభివృద్ధి, భిలాయ్ తెలుగు సమాజ్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
భిలాయ్ తెలుగు సమాజ్ ఆధ్వర్యంలో పేద మహిళలు, యువతులకు ఉచిత కుట్టు శిక్షణ అందిస్తూ నాలుగు వేల మందికి పైగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించారు. ప్రజాప్రతినిధుల నిధులతో పలువురికి కుట్టు మిషన్లు అందజేసి వారి జీవనోపాధికి చేయూతనిచ్చారు.
తన స్వగ్రామం అక్కుపల్లిలో సింహద్వారం నిర్మాణంతో పాటు యువజన సేవా సమితి భవన విస్తరణకు సహకరించారు. మత్స్యకారుల హక్కుల కోసం భిలాయ్ మత్స్యకారుల సామాజిక సంస్థను స్థాపించి ఉద్యమాలు నిర్వహించారు. కళారంగంలోనూ నాటకాలు, నాటికలకు దర్శకత్వం వహించి కళాకారుడిగా గుర్తింపు పొందారు.
భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో ఉత్తమ ఉద్యోగిగా పలుమార్లు నెహ్రూ అవార్డులు, పర్యావరణ అవార్డు, కేస్ అవార్డు అందుకోగా, సహకార సంఘాల్లో సేవలకు "ఉత్తమ డైరెక్టర్" పురస్కారంతో పాటు పలు సామాజిక సంస్థల నుంచి మదర్ థెరిసా అవార్డు, సంఘ సేవా పురస్కారం తదితర సత్కారాలు అందుకున్నారు.
ప్రస్తుతం భిలాయ్ తెలుగు సమాజ్ అధ్యక్షుడిగా, ఛత్తీస్‌గఢ్ తెలుగు మహాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, భిలాయ్ మత్స్యకారుల సామాజిక సంస్థ అధ్యక్షుడిగా సేవలందిస్తూ "సమాజ సేవే మానవ సేవ" అనే లక్ష్యంతో తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.


