మూడు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఉపాధ్యాయిని మృతి.




 మూడు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఉపాధ్యాయిని మృతి.

పలాసలో విషాద ఘటన.. ఆత్మహత్య కోణంలో పోలీసుల దర్యాప్తు.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పలాస, జూన్ 28 : 

పలాస పట్టణంలోని మారుతీనగర్‌లో నివాసముంటున్న ప్రభుత్వ పాఠశాల హిందీ ఉపాధ్యాయిని జన్ని రోహిణి (39) మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు రోజులుగా ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానం చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం, రోహిణి పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా కుటుంబ సభ్యులకు దూరంగా మారుతీనగర్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్నట్లు సమాచారం. మూడు రోజులుగా ఇంటి వద్ద ఎలాంటి కదలికలు లేకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

కాశీబుగ్గ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తలుపులు తెరిచి పరిశీలించగా, రోహిణి ఉరివేసుకున్న స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రాథమిక విచారణలో ఆమె మృతి చెంది మూడు రోజులు దాటినట్లు పోలీసులు వెల్లడించారు.

రోహిణి మృతి వార్త తెలిసిన వెంటనే సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విధుల పట్ల అంకితభావంతో, సౌమ్య స్వభావంతో పనిచేసే ఉపాధ్యాయినిగా ఆమెకు మంచి పేరు ఉందని సహచరులు పేర్కొన్నారు.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, రోహిణి భర్త జీవన్ విజయనగరం జీఎస్టీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె కావ్య ఫిజియోథెరపీ, చిన్న కుమార్తె భవ్య ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులు అభ్యసిస్తున్నారు.

ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. వ్యక్తిగత, కుటుంబ లేదా ఇతర కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. ఈ ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post