మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అరెస్ట్ – 14 రోజుల రిమాండ్.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, జూలై 24:
రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఆయనను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం బెయిల్‌ను తిరస్కరించి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను శ్రీకాకుళం సమీపంలోని అంపోలు సబ్‌జైలుకు తరలించారు.
ఈ ఘటన నేపథ్యంలో పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో బుధవారం సాయంత్రం నుంచి గురువారం వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రజలు గుమికూడకుండా చర్యలు చేపట్టారు. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదం కేసు నేపథ్యం
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన కేసులో మాజీ మంత్రి కుమారుడు అరవ వర్మ సిద్ధార్థను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అదే కేసులో సాక్ష్యాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారనే అభియోగంతో డాక్టర్ సీదిరి అప్పలరాజును ఏ–3గా చేర్చి అరెస్ట్ చేశారు.
భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
అప్పలరాజు అరెస్ట్ వార్త తెలిసిన వెంటనే పలాస, కాశీబుగ్గతో పాటు పరిసర మండలాల నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ పరిసరాలకు చేరుకున్నారు. వాహనాల రాకపోకలను నియంత్రించినప్పటికీ, కాలినడకన కూడా పలువురు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
అరెస్ట్ సమయంలో పోలీసులు, కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అప్పలరాజును కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గురువారం సాయంత్రం వరకు ఆయనను పోలీస్ స్టేషన్‌లో ఉంచి, అనంతరం కోర్టులో హాజరుపరిచారు.
కోర్టు ఆదేశాలు
వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అప్పలరాజును అంపోలు సబ్‌జైలుకు తరలించారు.
నేతల పరామర్శ
మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అందవరపు సూరిబాబు తదితరులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అప్పలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ధర్మాన కృష్ణదాస్ స్పందన
ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన కేసులో విచారణకు సహకరించినప్పటికీ మాజీ మంత్రి అప్పలరాజును కేసులో చేర్చి అరెస్ట్ చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. దీనిపై చట్టపరంగా పోరాడతామని తెలిపారు.
కుటుంబ సభ్యుల స్పందన
అప్పలరాజు అరెస్ట్ అనంతరం ఆయన సతీమణి శ్రీదేవి భావోద్వేగానికి గురయ్యారు. తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ నాయకులు ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు.

