నిరుద్యోగ భృతి, డీఎస్సీ అమలుపై రిలే నిరాహార దీక్షలు.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, ఆగస్టు 6:
పలాస నియోజకవర్గం మందస మండలం ఆధ్వర్యంలో గురువారం కాశీబుగ్గ జీఎంఈ కాలనీలోని ప్రగతి భవన్ వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి డా. సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి హాజరై దీక్షలకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం ఆశించిన మేర పురోగతి సాధించలేదని విమర్శించారు. నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని త్వరితగతిన అమలు చేయాలని, డీఎస్సీ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు వీలైనంత త్వరగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
శ్రీదేవి మాట్లాడుతూ, నిరుద్యోగ యువత, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిరుద్యోగ భృతి, డీఎస్సీకి సంబంధించిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.
ఈ రిలే నిరాహార దీక్షల్లో మందస మండలానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
