నూతన సంవత్సర వేడుకలపై అనకాపల్లి జిల్లా పోలీసుల ఆంక్షలు: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి.జిల్లా ఇంచార్జి రిపోర్టర్
పి. మహేశ్వరరావు అనకాపల్లి, డిసెంబర్ 31:
2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూనే, వేడుకల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అనకాపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం హెచ్చరించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలను జారీ చేశారు.
హోటళ్లు, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే వినోద కార్యక్రమాల్లో అశ్లీలత లేదా నగ్న ప్రదర్శనలు ఉండకూడదు. కార్యక్రమాలు నిర్దేశించిన సమయానికి ముగించాలి.
పార్టీల్లో డ్రగ్స్, నార్కోటిక్స్ లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగంపై కఠిన నిఘా ఉంటుంది. నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పూర్తిగా నిషేధం.
యువత బైక్ రేసింగ్‌లు, కారు రేసింగ్‌లకు పాల్పడకూడదు. అతివేగం మరియు అజాగ్రత్తగా వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేయబడతాయి.
మహిళలు, బాలికలపై వేధింపులను అరికట్టడానికి సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను (Special Teams) ఏర్పాటు చేయడం జరిగింది.
అగ్ని ప్రమాదాల నివారణకు బాణసంచా కాల్చడం నిషేధించబడింది. అలాగే డీజే సౌండ్ సిస్టమ్స్ వినియోగంపై పరిమితులు విధించారు.
ముందస్తు అనుమతి లేని ర్యాలీలు లేదా ఊరేగింపులు నిర్వహించకూడదు.
అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం కీలక ప్రాంతాల్లో అగ్నిమాపక యంత్రాలు మరియు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. అసాంఘిక శక్తులపై నిరంతరం నిఘా ఉంటుందని, ప్రజలందరూ పోలీసులకు సహకరించి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ కోరారు.
