ఎమ్మెల్యే బాలరాజు సమక్షంలో రెవెన్యూ అధికారులపై మాటల యుద్ధం చేసిన రాష్ట్ర స్థాయి కూటమి నేత "ఎస్. వి. ఆర్"


 

ఎమ్మెల్యే బాలరాజు సమక్షంలో రెవెన్యూ అధికారులపై మాటల యుద్ధం చేసిన రాష్ట్ర స్థాయి కూటమి నేత "ఎస్. వి. ఆర్"

టి నరసాపురం క్రైమ్ 9మీడియా ప్రతినిధి:
        ఏపిగుంట గ్రామ పరిధిలో గత ప్రభుత్వాల హయాంలో (2014-19) పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల విషయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టి నరసాపురం మండల తహశీల్దార్ లేఅవుట్ చేసి ఇచ్చిన ఈ స్థలాల్లో కొందరు పేదలు ఇళ్లు నిర్మించుకోగా, మరికొందరు నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో అధికారులు జేసీబీలతో వచ్చి ఇళ్లను కూల్చివేయడానికి ప్రయత్నించడం పట్ల కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హై కోర్టు స్టే: పట్టాలు పొందిన లబ్ధిదారులు ఈ విషయంపై ఇప్పటికే హై కోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం స్టేటస్ కో (యధాతథ స్థితి) ఉత్తర్వులు అమలులో ఉన్నాయని వారు గుర్తుచేశారు. హై కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ అధికారులు కూల్చివేతలకు దిగడంపై కూటమి నేతలు అభ్యంతరం తెలిపారు.

ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కు వినతి: 
       ఈ వివాదంపై స్థానిక ఎమ్మెల్యేను కూటమి నేతలు నిలదీశారు. అధికారుల తీరుపై ఫిర్యాదు చేస్తూ, న్యాయం చేయాలని పట్టాలను చూపిస్తూ కూటమి నేతలు వాపోయారు.

ఎమ్మెల్యే చిర్రి స్పందన : 
        ఇళ్ల పట్టాల విషయంలో అధికారుల ఏక పక్ష నిర్ణయాలు సరికాదని, హై కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై సంయమనం పాటించాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచించారు. వివాదస్పదంగా ఉన్న ఇళ్ల విషయంలో స్పష్టత వచ్చే వరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. పేదలకు ఇచ్చిన పట్టాలను రద్దు చేసే హక్కు ఎవరికీ లేదని, తాము న్యాయపోరాటం చేస్తామని కూటమి నేతలు స్పష్టం చేశారు.

ఇదీ సంగతీ...! :
       కూటమిలోని కొంతమంది నాయకులు ప్రభుత్వ భూమిని ఆదాయ వనరుగా మార్చుకుని ప్రభుత్వ అధికారులపై తిరుగుబాటు చేస్తున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వ భూమి వివాదములు ఉన్నను కూటమిలోని రాష్ట్రస్థాయి, క్షేత్రస్థాయి నాయకుల సైతం అనధికారిక విక్రయాలు చేయడం, అక్రమ ఆక్రమణదారులకు అండగా నిలవడం ఏలూరు జిల్లాలోని టి నరసాపురం మండలంలో పరిపాటిగా మారింది. ఏపిగుంట గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి అవుతున్నదని రెవిన్యూ అధికారులకు స్థానికులు తెలియజేయడంతో అధికారులు గతంలో ఆక్రమణ దారులపై టి నరసాపురం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా అధికారులు పలుమార్లు ఆక్రమణకు ప్రయత్నిస్తున్న వ్యక్తులను రెవెన్యూ, పోలీసు కార్యాలయాలములకు పిలిపించి హెచ్చరించడం జరిగిందని అధికారులు తెలిపారు. అయినా ఆక్రమణదారులు ఆ స్థలంలో షెడ్డు నిర్మాణములు చేశారని ఆలస్యంగా అధికారులకు తెలియడంతో గురువారం రెవిన్యూ అధికారులు షెడ్డు నిర్మాణములు కూల్చివేయడానికి యంత్రాలను తీసుకుని వెళ్లగా కూటమిలోని రాష్ట్ర స్థాయి నాయకులు జెెసిబి పై, అధికారులపై పెట్రోల్ పోసి తగలబెట్టమన్నట్లు అక్రమ ఆక్రమణదారులకు సలహా ఇచ్చినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ భూమి వివాదం హై కోర్టులో ఉంటే కూటమిలోని స్థానిక నాయకులు దగ్గర ఉండి అక్రమ ఆక్రమణదారులకు వెన్నుదన్నుగా నిలబడి గృహప్రవేశములు చేయించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మండల తహశీల్దార్ టి ఎస్ సాయిబాబా ను వివరణ కోరగా ఆ భూమి ప్రస్తుతం హై కోర్టు విచారణలో ఉందని ఆ స్థలాన్ని ఎవరు ఆక్రమించినను వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చరవాణిలో తెలిపారు.అసలు ఈ భూమికి సంబంధిన వివరాల్లోకి వెళితే 2003లో అప్పటి తెదేపా ప్రభుత్వ హయాంలో సర్వే నెంబర్ 60/16బి , 17బి అండ్ అదర్స్ సర్వే నంబర్ లలో దాదాపు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన సుమారు 25మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసినట్లు సమాచారం.అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పట్టాదారులను ఆ స్థలంలోకి వెళ్లనీయకుండా అడ్డుకొని వేరే వారికి పట్టాలివ్వడానికి ప్రయత్నాలు జరుగుతుండటంతో లబ్ధిదారులు 2008 లో హై కోర్టు ను ఆశ్రయించారు.అప్పటినుండి ఆ భూమి ఖాళీగానే ఉందని ప్రజలు తెలుపుతున్నారు.
2016లో హై కోర్టు వీరికి ఇచ్చిన భూమి పట్టాలను సమ్మతిస్తూ...!, మిగిలిన భూమిని వేరే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. విచిత్రం ఏమిటంటే హై కోర్టు జడ్జిమెంటుకు కేవలం 17 రోజులు ముందు అంటే ప్రభుత్వ భూమి వివాదం హైకోర్టులో ఉండగానే అప్పటి మండల తహశీల్దార్ ఎన్. నాగరాజు ఇదే భూమికి మరో 24 మందికి పట్టాలు మంజూరు చేసినట్లు సమాచారం. పట్టాదారులు భూమిని స్వాధీనపరచుకొని ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రయత్నిస్తుండగా ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం తమ పట్టాలను ఎక్కడ రద్దుచేస్తారో...! అన్న భయంతో వీరు 2020లో హై కోర్ట్ ను ఆశ్రయించగా హై కోర్ట్ "స్టేటస్ కో" ఇచ్చిందని లబ్ధిదారులు తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు ఈ భూమిలో కొంతమంది వ్యక్తులు కూటమి పార్టీ నాయకుల అండతో అనధికారిక విక్రయములు చేసి, అక్రమంగా భూమిలోకి ప్రవేశించి రాత్రికి రాత్రే షెడ్డుల నిర్మాణములు ఏర్పాటు చేసినట్లు సమాచారం రెవిన్యూ అధికారులకు అందడంతో వారు షెడ్డులను కూల్చి వేయడానికి ప్రయత్నించగా కొందరు కూటమి నాయకులు అడ్డుకున్నట్లు సమాచారం.అసలు ఏపిగుంట గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమి ఎంత ? ప్రభుత్వంఎంతమందికి పట్టాలు మంజూరు చేసింది ? ఈ ప్రభుత్వ భూమిని కాసులుగా మార్చుకుంటున్న కూటమి నాయకులపై చర్యలు తీసుకునేదెవరు ? టి నరసాపురం మండల ప్రధాన కేంద్రంలోని మండల విద్యాశాఖ కార్యాలయ ప్రాంగణంలో మంగళ వారం జరిగిన "జన వాణి" కార్యక్రమంలో ప్రతీ వాడు హై కోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకు వస్తాడు అంటూ... అవన్నీ దొంగ పట్టాలే రెవెన్యూ అధికారులకు తెలియదా ! అని రాష్ట్ర స్థాయి కూటమి నేత "ఎస్. వి. ఆర్" గళాన్ని వినిపించారు. అంతే కాదు అనధికారిక క్రయ, విక్రయాలు చేస్తున్న వారి, అక్రమ ఆక్రమణదారుల తరుపున సాక్షాత్తు పోలవరం నియోజక వర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమక్షంలో రెవెన్యూ అధికారులపై రాష్ట్ర స్థాయి కూటమి నేత శీలం వెంకటేశ్వర రావు మాటల యుద్ధం చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ రాష్ట్ర స్థాయి కూటమి నేతపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందా ? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అనధికారిక క్రయ, విక్రయాలు చేస్తున్న వారిపై, అక్రమ ఆక్రమణదారులపై చర్యలు తీసుకునేదెవరు ? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post