అనకాపల్లి జిల్లాలో ఘనంగా 11వ విడత మొబైల్ రికవరీ మేళా.
బాధితులకు రూ.1.50 కోట్ల విలువైన 750 మొబైల్ ఫోన్లు అందజేత - జిల్లా ఎస్పీతుహిన్ సిన్హా.
మొబైల్ కేవలం పరికరం కాదు, అది మన వ్యక్తిగత గుర్తింపు: జిల్లా ఎస్పీతుహిన్ సిన్హా.
అనకాపల్లి, డిసెంబర్ :10 అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, ప్రజల ఆస్తుల రక్షణే ధ్యేయంగా పని చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం నాడు జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో 11వ విడత "మొబైల్ రికవరీ మేళా"ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐ.పి.ఎస్. పాల్గొని, గత 2-3 నెలల కాలంలో రికవరీ చేసిన 750 మొబైల్ ఫోన్లను (విలువ సుమారు రూ. 1.50 కోట్లు) సంబంధిత బాధితులకు స్వయంగా అందజేశారు.
రికవరీ వివరాలు మరియు గణాంకాలు:
జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.. జిల్లాలో ఐటీ కోర్ టీమ్ చేస్తున్న నిరంతర కృషిని కొనియాడారు.
ప్రస్తుత రికవరీ: ఈ 11వ విడతలో 750 మొబైల్ ఫోన్లు (యాపిల్, శాంసంగ్, వివో, రెడ్ మి మొదలైనవి) రికవరీ చేయబడ్డాయి.
మొత్తం రికవరీ:01.06.2022 నుండి ఇప్పటివరకు 11 విడతల్లో కలిపి మొత్తం 4,086 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది. *వీటి మొత్తం విలువ సుమారు రూ. 6.77 కోట్లు.
ఈ ఏడాది రికవరీ: కేవలం ఈ సంవత్సరంలోనే ఇప్పటివరకు జరిగిన 3 మేళాల ద్వారా 1,880 మొబైల్ ఫోన్లను (విలువ రూ. 3.70 కోట్లు) రికవరీ చేసి బాధితులకు అందించాము.
సరిహద్దులు దాటినా.. గాలింపు:
కేవలం మన జిల్లాలోనే కాకుండా, పొరుగు జిల్లాలైన తూర్పు గోదావరి, అనంతపురం, సత్యసాయి జిల్లాలతో పాటు.. ఇతర రాష్ట్రాలైన ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, తెలంగాణ ప్రాంతాల నుండి కూడా మన ఐటీ కోర్ బృందం వ్యయప్రయాసలకు ఓర్చి ఈ ఫోన్లను రికవరీ చేసిందని ఎస్పీ తెలిపారు.
మొబైల్ ప్రాముఖ్యత - ఎస్పీ సందేశం:
"ప్రస్తుత కాలంలో మొబైల్ అనేది కేవలం మాట్లాడటానికి ఉపయోగించే పరికరం మాత్రమే కాదు, అది మన 'పర్సనల్ ఐడెంటిటీ'గా మారింది. మన ఫోటోలు, బ్యాంకింగ్ (UPI), ముఖ్యమైన నోట్స్ అన్నీ అందులోనే ఉంటున్నాయి. గత మేళాలో ఒక విద్యార్థిని తన కాలేజీ నోట్స్ అన్నీ ఫోన్లో ఉండటం వల్ల, ఫోన్ దొరకగానే చాలా సంతోషించింది. బాధితుల కళ్ళలో ఆ ఆనందం చూడటమే మాకు నిజమైన సంతృప్తి," అని ఎస్పీ పేర్కొన్నారు.
సులభతరం చేసిన ఫిర్యాదు విధానం:
మొబైల్ పోయినప్పుడు బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ఎస్పీ స్పష్టం చేశారు.
CEIR పోర్టల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన www.ceir.gov.in వెబ్సైట్లో 'Lost Mobile' ఆప్షన్ ద్వారా IMEI నెంబర్, ఫోన్ మోడల్ వివరాలు నమోదు చేయవచ్చు.
*వాట్సాప్ సేవలు:* అనకాపల్లి జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 93469 12007 కు "Hi" అని మెసేజ్ చేసి, వచ్చే లింక్ ద్వారా ఇంట్లో నుంచే ఫిర్యాదు చేయవచ్చు.
ప్రజలు అందించిన సమాచారం ఆధారంగానే ఐటీ కోర్ టీమ్ ఇంత వేగంగా స్పందించి ఫలితాలు సాధిస్తోందని, ప్రజలు ఈ విధానాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
నిరంతరం శ్రమిస్తూ, సాంకేతికతను జోడించి బాధితులకు న్యాయం చేస్తున్న సైబర్ సెల్ సిఐ బెండి వెంకటరావు, ఐటీ కోర్ ఎస్సై సురేష్ బాబు మరియు సిబ్బందిని, ప్రత్యేక సెల్ బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. హెచ్.సి లక్ష్మీపతి రావు, పీ.సీలు , అనంత కళ్యాణ్, గోవిందరావు, దిలీప్ కుమార్, నరేష్, హోంగార్డులు సింహాచలం, రమేష్ కుమార్ లకు ప్రశంసా పత్రాలు మరియు నగదు రివార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన్ రావు, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ బి.వెంకట రావు, ఇతర ఇన్స్పెక్టర్లు బాలసూర్యా రావు, లక్ష్మీ, రమేష్, ఐటీ కోర్ ఎస్సై బి.సురేష్ బాబు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
