ఉంగుటూరు మండలం నారాయణపురంలో పంట నష్టాలను పరిశీలించిన కేంద్ర బృందం.





 ఉంగుటూరు మండలం నారాయణపురంలో పంట నష్టాలను పరిశీలించిన కేంద్ర బృందం.

జిల్లాలో పంట నష్టాలను కేంద్ర బృందానికి వివరించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.  
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శరత్.                 

             ఉంగుటూరు/ఏలూరు, నవంబర్, 10: ఏలూరు జిల్లాలో మోంథా తుఫాన్ నష్టాల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం నియమించిన పరిశీలన బృందం సోమవారం ఉంగుటూరు మండలం నారాయణపురం చేరుకుని ముందుగా గొట్టుముక్కల సత్యనారాయణరాజు పొలంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించింది. పంట నష్టాలను గురించి అక్కడకు చేరుకున్న రైతులను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా యంత్రాంగం తుఫాన్ నష్టాలు, అనంతరం చేపట్టిన పునరుద్ధరణ పనులు, తుఫాను బాధితులకు ఏర్పాటుచేసిన పునరావాస కార్యక్రమాలపై ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను బృందం సభ్యులు పరిశీలించారు. తేమ శాతం కొలిచే యంత్రం ద్వారా దెబ్బతిన్న వరి పంట తేమ శాతం కొలువగా 23. 6 శాతంగా తేలింది. దెబ్బతిన్న వరిదుబ్బులను, పాడైన మినుము పంటలు, అరటి, ఉద్యాన పంటలను బృందం సభ్యులు పరిశీలించి వాటి వివరాలను నమోదు చేసుకున్నారు. జిల్లాలో మోంథా తుఫాన్ కారణంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు, గృహాలు, విద్యుత్, రోడ్లు, ఇతర నష్టాలను కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వివరించారు. కేంద్ర బృందంతో పాటు వ్యవసాయ శాఖ కమీషనర్ ఢిల్లీరావు, ప్రభృతులు ఉన్నారు. అనంతరం కేంద్ర బృందం తూర్పు గోదావరి జిల్లా బయలుదేరి వెళ్ళింది.  

        జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ, ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, ఉద్యానవనాల అధికారి షాజా నాయక్, తహసీల్దార్ పూర్ణారావు, ఎంపిపి ఘంటా శ్రీలక్ష్మి, సర్పంచ్ టి. అలకానంద, ఎంపిటిసి మహాలక్ష్మి, ప్రభృతులు పాల్గొన్నారు. 
 
          కేంద్ర పరిశీలన బృందంలో కేంద్ర వ్యవసాయ శాఖ మరియు రైతు సంక్షేమ శాఖ డైరెక్టర్ డా. కె. పొనుసామి, సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ శ్రీనివాసు బాల్రి, కేంద్ర విద్యుత్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ ఆర్తీ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్ కుమార్ మీనా లు సభ్యులుగా ఉన్నారు.
           

Post a Comment

Previous Post Next Post