ఇంద్రఖీలాద్రి అమ్మ‌వారి దసరా సంబ‌రాల‌కు స‌ర్వం సిద్ధం.








ఇంద్రఖీలాద్రి అమ్మ‌వారి దసరా సంబ‌రాల‌కు స‌ర్వం సిద్ధం.


ఎన్‌టీఆర్ జిల్లా, సెప్టెంబ‌ర్ 20, 2025.

-  ద‌స‌రా ఉత్స‌వాల‌కు క‌నీసం 20 ల‌క్ష‌ల మంది భ‌క్తులు వ‌స్తార‌ని అంచ‌నా.

-  ఆ స్థాయిలోనే అన్నింటా ప‌క‌డ్బందీ ఏర్పాట్లు.

-  35 సెక్టార్ల‌లో మూడు షిఫ్ట్‌ల్లో ప్ర‌త్యేక బృందాలు.

-  24X7 సేవ‌లందించే క‌మాండ్ కంట్రోల్ కేంద్రం.

-  సాధార‌ణ భ‌క్తుల సౌక‌ర్యార్థం రూ. 500 ద‌ర్శ‌నాలు ర‌ద్దు.

-  ఏఐ టెక్నాల‌జీతో క్యూ లైన్ల‌లో భ‌క్తుల ర‌ద్దీపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌.

-  స్వీయ నియంత్ర‌ణ‌తో స‌మ‌ష్టిగా ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేద్దాం.

-  ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌ల‌కు తావులేకుండా భ‌ద్ర‌తా ఏర్పాట్లు.

-  జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, సీపీ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు.


శ్రీ దుర్గా మ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో ఈ నెల 22 నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు జ‌రిగే ద‌స‌రా మ‌హోత్స‌వాల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేశామ‌ని.. క‌నీసం 20 ల‌క్ష‌ల మంది భ‌క్తులు ఈసారి ఉత్స‌వాల‌కు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని.. ఆస్థాయిలో ఏర్పాట్లు ఉన్నాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ‌, సీపీ రాజ‌శేఖ‌ర‌బాబు తెలిపారు. 

ద‌స‌రా మ‌హోత్స‌వాలు-2025పై శ‌నివారం క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యం మ‌హామండ‌పం ఆరో అంత‌స్తులో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌, సీపీ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర హెచ్ఎం, ఈవో వీకే శీనానాయ‌క్‌.. ఆల‌య పండితులు, అధికారుల‌తో క‌లిసి మీడియా స‌మ‌న్వ‌య స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ఎంత‌మంచి భ‌క్తులు వ‌చ్చినా ఎక్క‌డా లోటుపాట్లు లేకుండా ఈసారి ఏర్పాట్లు చేశామ‌ని.. ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని కూడా ఉప‌యోగించుకుంటూ సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తూ వినూత్న విధానాల‌తో ముందుకెళ్తున్న‌ట్లు తెలిపారు. సామాన్య భ‌క్తుల‌కు ప్రాధాన్య‌త‌నిస్తూ ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణంలో అమ్మ‌వారి ద‌ర్శ‌నం మ‌ధురానుభూతిని క‌లిగించేలా ఏర్పాట్లు చేశామ‌న్నారు. సామాన్య భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకొని రూ. 500 టికెట్‌ను ర‌ద్దు చేశామ‌ని.. అదేవిధంగా ర‌ద్దీ ఎక్కువ‌గా లేని ఉదయం ఏడు నుంచి 9 గంటల మధ్య, సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల మధ్య వీఐపీ దర్శనాలు ఉంటాయని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు సాయంత్రం 4 గంట‌ల నుంచి 5 గంట‌ల వ‌ర‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశామ‌న్నారు. వినాయ‌క గుడి నుంచి.. టోల్ గేట్ ద్వారా కొండ‌పైకి వెళ్లి అమ్మ‌వారి ద‌ర్శ‌నం చేసుకునేందుకు ఏర్పాటుచేసిన క్యూలైన్ల‌తోపాటు ఇత‌ర క్యూలైన్ల‌లో ప్ర‌తి 100 మీట‌ర్ల‌కు క్యూఆర్ కోడ్‌తో ఫీడ్ బ్యాక్ తెలిపేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. ప్ర‌తి 50 మీట‌ర్ల‌కు ఒక అత్య‌వ‌స‌ర ద్వారాన్ని ఏర్పాటుచేసిన‌ట్లు వివ‌రించారు. 90 శాతానికి పైగా సంతృప్తి స్థాయి న‌మోద‌య్యేలా క్యూలైన్ల‌లో వేచిఉండే స‌మ‌యాన్ని బాగా త‌గ్గించేందుకు కృషిచేస్తున్నామ‌న్నారు. 

మోడ‌ల్ గెస్ట్‌హౌస్‌లోని క‌మాండ్ కంట్రోల్ కేంద్రానికి 500 సీసీటీవీల‌ను అనుసంధానించిన‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు.

*కృత్రిమ మేధ‌తో క్యూలైన్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌:*

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక‌త‌తో క్యూలైన్ల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. మూలాన‌క్ష‌త్రం రోజున గౌర‌వ ముఖ్య‌మంత్రి అమ్మ‌వారికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌న్నారు. మొత్తం ప్రాంతాన్ని 35 సెక్టార్లుగా విభ‌జించి.. ఒక్కో సెక్టారుకు రెవెన్యూ, వీఎంసీ, పోలీస్‌.. ఇలా వివిధ శాఖ‌ల అధికారుల బృందాల‌ను నియ‌మించామ‌ని వివ‌రించారు. 100 మీ. - 500 మీ. ప‌రిధిలోని సెక్టార్‌లో ఏ స‌మ‌స్య ఎదురైనా ఈ బృందాలు త‌క్ష‌ణం స్పందించి స‌రిదిద్దేందుకు చ‌ర్య‌లు తీసుకుంటాయ‌ని.. క‌మాండ్ కంట్రోల్ కేంద్రానికి స‌మాచారం అందిస్తాయ‌ని వివ‌రించారు. అంద‌రం స‌మ‌ష్టిగా ప‌నిచేసి ద‌స‌రా మ‌హోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేద్దామ‌ని.. ఈ ప్ర‌క్రియ‌లో మీడియా భాగ‌స్వామ్యం చాలా కీల‌క‌మ‌ని పేర్కొన్నారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి, గౌర‌వ మంత్రుల బృందం సూచ‌న‌ల‌ను ప‌ర‌గ‌ణ‌న‌లోకి తీసుకొని ఏర్పాట్ల‌లో లోటుపాట్లు లేకుండా చేస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు.

*స్వీయ నియంత్ర‌ణ‌తో స‌మ‌ష్టిగా కృషిచేద్దాం..*

ద‌స‌రా మ‌హోత్స‌వాల మ‌హా య‌జ్ఙంలో భాగ‌మ‌వుతున్న ప్ర‌తిఒక్క‌రూ స్వీయ నియంత్ర‌ణ‌తో స‌మ‌ష్టిగా కృషిచేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని.. ఎక్క‌డా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌ల‌కు తావులేకుండా భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశామ‌ని సీపీ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు తెలిపారు. గ‌తేడాది అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకొని ఈసారి మ‌రింత ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేశామ‌న్నారు. పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లు, ర‌వాణా, శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌.. ఇలా ప్ర‌తి అంశంలోనూ కొండ‌పైన, కొండ కింద ప్రాంతాల్లో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని సీపీ రాజ‌శేఖ‌ర‌బాబు తెలిపారు.

*వీఎంసీ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర హెచ్ఎం.. చాలా ముఖ్య‌మైన పారిశుద్ధ్యం, మిన‌ర‌ల్ వాట‌ర్ పంపిణీ, మ‌రుగుదొడ్లు వంటి వాటికి సంబంధించిన ఏర్పాట్ల‌ను వివ‌రించారు. 40 పాయింట్ల‌లో 25 ల‌క్ష‌ల వాట‌ర్ బాటిళ్ల‌ను సిద్దంగా ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు. మూడు షిఫ్టుల్లో 1,600 మంది సిబ్బంది పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్నార‌ని తెలిపారు. 405 మొబైల్ టాయిలెట్ల‌ను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు ధ్యానచంద్ర వెల్ల‌డించారు.

*ఆల‌య ఈవో వీకే శీనా నాయ‌క్‌.. ల‌డ్డూ ప్ర‌సాదాల త‌యారీ, విక్ర‌య కేంద్రాలు, అన్న ప్ర‌సాదం అందించేందుకు చేసిన ఏర్పాట్లు త‌దిత‌రాల‌ను వివ‌రించారు. క్యూలైన్ల‌లో భ‌క్తుల‌కు తాగునీటితో పాటు పాలు, మ‌జ్జిగ‌, బిస్క‌ట్ ప్యాకెట్లు అందిస్తామ‌ని తెలిపారు.
 

Post a Comment

Previous Post Next Post