ఏలూరులో బస్సుల కోసం విద్యార్థులు పడిగాపులు.
ఏలూరు : స్కూళ్ళకు,కాలేజీలకు వెళ్లి ఇంటిముఖం పట్టేందుకు ఏలూరు ప్రాంత విద్యార్ధులు నానా అవస్థలూ పడుతున్నారు విద్యార్థిని, విద్యార్థులు తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్లాలంటే బస్సుల కోసం నిరీక్షించాల్సిందే. సమయానికి బస్సులు రాక విద్యార్థులు చీకటి పడే వరకు రోడ్లపైనే ఉంటున్నారు. కళాశాల సమయాలు మారినా విద్యార్థులకు అనుకూలంగా బస్సు వేళలను మాత్రం ఆర్టీసీ అధికారులు మార్చడం లేదు. దీంతో విద్యార్థులు చీకటి పడినా ఇంటికి వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఆర్టీసి బస్సుల్లో విద్యార్థులు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఉదయం, సాయంత్రం.. ఆర్టీసి బస్సుల్లో నిలబడుదామంటే.. స్థలం ఉండటం లేదు. విద్యార్థులు బస్సులో ఎక్కేందుకు యుద్ధమే చేస్తున్నారు. ముఖ్యంగా పడిగాపులు కాస్తున్నారు. అంతేకాకుండా ఉదయం వేళ బస్సులు తక్కువగా ఉండటంతో వచ్చిన బస్సులో వెళ్లాలనుకుంటే బస్సు నిండా జనం ఉండటంతో ఎక్కలేకపోతున్నారు. కళాశాలకు వెళ్లాడానికి విద్యార్థులు సతమతం అవుతున్నారు. కళాశాల సమయంలో ఒక్కటి, రెండు బస్సులు మాత్రమే వస్తున్నాయి. వాటిలోనల ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. కానీ అప్పటికే ప్రయాణీకులతో బస్సు నిండిపోయి ఉంటుంది. దీంతో విద్యార్ధులు కష్టంగా ప్రయాణం చేస్తున్నారు. పెరిగిన రద్దీ కారణంగా చాలా మంది ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఆటోలోనే వెళ్తున్నారు. ఆటోలో వెళ్లడం ప్రమాదకరమని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం పూట మరింత రద్దీగా ఉంటుంది. సరిగా బస్సులు దొరకడం లేదు. ఇంటికి ఆలస్యంగా వెళ్తున్నారు. విద్యార్థులు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఏలూరు పాత బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్ లలో కళాశాలలకు వెళ్ళేందుకు విద్యార్థిని, విద్యార్థులు బస్సుల కోసం పడిగాపులు కాయవలసి వస్తుంది. వట్లూరు లో వున్న సర్ సి ఆర్ ఆర్ కళాశాలాలకు చెందిన పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, విద్యార్థిని, విద్యార్థులు ఆయా కళాశాలలకు వెళ్ళాలంటే హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్ళేవారికి గుడివాడ, నూజివీడుకు వెళ్లే పల్లెవెలుగు బస్సు లే దిక్కు . తిరుగు ప్రయాణంలో విద్యార్థులు సాయంత్రం నాలుగు గంటలకే కళాశాల నుంచి బయటికి వచ్చిఆ బస్సుల కోసమే రెండు మూడు గంటలు వేచి ఉండాల్సి వస్తోంది,.
ఫలితం లేదు.....
బస్సు వేళలు మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్టీసీ అధికారులను పలుసార్లు కోరినా ఫలితం లేదు. విద్యార్థులు ఇంటికొచ్చే సరికే రాత్రి అయి అలసిపోతున్నారు. దీంతో ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్‌నూ పూర్తి చేయలేకపోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఆర్టీసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి సాయంత్రం వచ్చే బస్సు వేళలను మార్చాలని, రెండు ట్రిప్పులు నడపాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇంటికెళ్లే సరికి చీకటి అవుతుంది : గ్రీష్మా
సాయంత్రం నాలుగు గంటలకు కాలేజీ నుంచి బయటి కొస్తాం. బస్సు కోసం 2.,3 గంటలపాటు నిరీక్షించాల్సివస్తోంది. ఇంటికెళ్లే సరికి చీకటి అవుతుంది. హోంవర్క్ చేసేందుకు, చదువుకునేందుకు సమయం ఉండడంలేదు. అధికారులు మా ఇబ్బందుల ను గుర్తించి బస్సు వేళలను మార్చాలి.
నిలబడాల్సిందే..... జై సూర్య
కళాశాల అయ్యాక ఇంటికి వెళ్లాలంటే నరకయాతన. రోడ్డుపై నిలబడాల్సిందే. బస్సు వచ్చినా రద్దీ చూసి ఆపరు. ఒక వేళ బస్సు ఆపినా జనంతో కిక్కిరిసిపోయి బస్సుకూడా ఎక్కలేని పరిస్థితి.
