ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే గౌతు శిరీష.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్ తమ్మినాన
పలాస, ఆగస్టు 7:
ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష అన్నారు. పలాసలో రైతు బజార్లు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఒంటరి మహిళల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. వివాహం కాని మహిళలు, భర్త వదిలేసిన వారు, చిన్న వయసులోనే వైధవ్యం పొందిన మహిళల సామాజిక, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఒంటరి మహిళలకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు.
రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి నాణ్యమైన సన్న బియ్యాన్ని మార్కెట్ ధర కంటే రూ.10 నుంచి రూ.15 వరకు తక్కువ ధరకే ప్రతి నెలా 10 కిలోల చొప్పున ప్రత్యేక అవుట్‌లెట్ల ద్వారా అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని చెప్పారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటో కార్మికుల ఆదాయం దెబ్బతినకుండా వారికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన త్రీ రోడ్స్ జంక్షన్ నుంచి అప్పల రోడ్డు వరకు ఉన్న రహదారిని ప్రత్యేక చొరవతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని ఎమ్మెల్యే వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ, కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.


