యువతకు నైపుణ్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం కలెక్టర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు భవిష్యత్తు ఉద్యోగాలు, ఉపాధికి ఉత్తమ మార్గాలు చూపే విధంగా ఐటిఐ కళాశాలలను అభివృద్ధి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. మంగళవారం ఆయన ఒంగోలు ప్రభుత్వ బాలురు, బాలికల ఐటిఐ కళాశాలలను సందర్శించారు. కార్యాలయ ప్రాంగణాన్ని, అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వెహికల్స్ , డ్రోన్ టెక్నాలజీ లో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సెంచూరియన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. త్వరలోనే ఇక్కడ శిక్షణ ప్రారంభించేందుకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారించామన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు జిల్లా మినరల్ ఫండ్ నుంచి కూడా నిధులను కేటాయించినట్లు తెలిపారు. ఈ.వీ, డ్రోన్ టెక్నాలజీతోపాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్లంబింగ్, ఎలక్ట్రికల్స్, ఫ్లోరింగ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో యువతకు ఇక్కడ శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి ఐటిఐ కేంద్రంలో ఒక న్యాక్ ( నేషనల్ అప్రెంటీస్షిప్ సర్టిఫికెట్ ) సెంటరును కూడా పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీ.నారా లోకేష్ దిశా నిర్దేశం మేరకు ఒంగోలు ఐటిఐ కేంద్రంలో కూడా ఏర్పాటు చేసేలా ఈ ప్రాంగణంలో నాలుగు ఎకరాల స్థలం కేటాయించామన్నారు. వివిధ విభాగాలలో జిల్లా యువతకు నైపుణ్యం కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి రవితేజ, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, సెంచూరియన్ యూనివర్సిటీ ప్రతినిధులు, కళాశాల ప్రిన్సిపాళ్లు వరప్రసాద్ బాబు ( బాలురు ) , రాజేశ్వర రావు ( బాలికలు ), ఇతర అధికారులు ఉన్నారు.
