ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 28 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు శ్రీ కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు…
1.పరిశ్రమలు & వాణిజ్య శాఖ:
ఆంధ్రప్రదేశ్ సర్క్యూలర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం (4.0) 2025-30 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
పెరుగుతున్న పారిశ్రామిక వ్యర్థాల సవాళ్లు, అభివృద్ధి చెందుతున్న స్థిరత్వ అవసరాలు, మరియు సర్క్యూలర్ ఎకానమీ నమూనాల నుండి వెలువడుతున్న ఆర్థిక అవకాశాలను మంత్రివర్గం సమగ్రంగా సమీక్షించింది. ఈ వివరణాత్మక మూల్యాంకనం తర్వాత, మంత్రివర్గం 2025–2030 కాలానికి ఆంధ్రప్రదేశ్ సర్క్యూలర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానాన్ని అధికారికంగా ఆమోదించింది.
స్వర్ణాంధ్ర 2047 సాకారంలో భాగంగా ఈ విధానం భారతదేశంలో మొట్టమొదటి సమగ్ర సర్క్యూలర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానంగా (చెత్త నుండి సంపద సృష్టి) నిలిచి, ద్విస్థాయి మౌలిక సదుపాయాల నమూనా, పారిశ్రామిక సైమ్‌బయోసిస్ ఆవశ్యకత, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ & సర్క్యూలర్ ఎకానమీ ఇంటరాక్టివ్ ఆర్థిక డ్యాష్‌బోర్డ్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ విధానం ద్వారా చెత్త నుండి సంపద సృష్టించే ఎం.ఎస్.ఎం.ఇ.ల స్థాపనకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కలుగనున్నాయి.
2.యువజన, పర్యాటక & సాంస్కృతిక శాఖ:
A.P. టూరిజం భూమి కేటాయింపు విధానం 2024-29కు అనుబంధ చేరికలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ అనుబంధంలో భూమి కేటాయింపుకు అర్హత, లాండ్ బ్యాంక్ నోటిఫికేషన్, పర్యాటక ప్రాజెక్టుల కోసం ప్రకటించిన భూములను కేటాయించే విధానం, ప్రకటించిన పరిమితుల ఆధారంగా ప్రతిపాదనలు/DPRల మూల్యాంకనం, ప్రాజెక్ట్ అమలు కాలపరిమితులు వంటి ముఖ్య అంశాలు చేర్చబడ్డాయి. దరఖాస్తుదారుడు అంచనా వేసిన ప్రాజెక్ట్ వ్యయంలో కనిష్టం 50% నెట్ వర్త్ కలిగి ఉండాలి, పేరెంట్ కంపెనీ 76% షేర్‌హోల్డింగ్ కలిగి ఉండాలి, కన్సార్టియంలో గరిష్టంగా మూడు సభ్యులు మాత్రమే ఉండాలి, లీడ్ మెంబర్ 51% మరియు మిగిలిన ఇద్దరు సభ్యులు కనిష్టం 20% వాటా కలిగి ఉండాలి అని నిర్దేశించబడింది.
3.యువజన, పర్యాటక & సాంస్కృతిక శాఖ:
అధికార భాషా కమిషన్ పేరును “మండలి వెంకట కృష్ణరావు అధికార భాషా కమిషన్” గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా కమిషన్ 1966లోని ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా చట్టం నిబంధనల కింద ప్రభుత్వానికి పరిపాలనలో తెలుగును ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడింది. శ్రీ మండలి వెంకట కృష్ణరావు ఈ కమిషన్ స్థాపనలోనే కీలక పాత్ర పోషించారు, దాని లక్ష్యాలను రూపొందించడంలో మరియు దాని ప్రారంభ సంవత్సరాలలో విధాన దిశను అందించడంలో కీలకమైన పాత్ర పోషించారు. అధికారిక భాషా కమిషన్ స్థాపనలో వారి పాత్ర, తెలుగు భాషకు వారి విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు గారు తే.4 ఆగస్టు 2025న విజయవాడలోని తుమ్మలపల్లి కలాక్షేత్రంలో జరిగిన శ్రీ మండలి వెంకట కృష్ణరావు శతజయంతి వేడుకల సందర్భంగా అధికారిక భాషా కమిషన్‌ను “మండలి వెంకట కృష్ణరావు అధికారిక భాషా కమిషన్” గా పేరు మార్చనున్నట్లు ప్రకటించారు. నాటి ప్రకటనను వాస్తవ రూపం కల్పిస్తూ వారి గౌరవార్థం కమిషన్‌ను పేరు మార్చడం అత్యంత సముచితమైనది.
4.పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర భూమి (వ్యవసాయేతర ప్రయోజనాలకు మార్పు) చట్టం, 2006 (NALA చట్టం) రద్దు చేసే నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు చట్టం, 2016, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం, 2014, ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ చట్టం, 1920 & ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీలు చట్టం, 1965లకు కొన్ని సవరణలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ ఆమోదం వలన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ లాండ్ (కన్వర్షన్ ఫర్ నాన్-అగ్రికల్చరల్ పర్పసెస్) చట్టం, 2006 రద్దు చేయడం వలన ఏర్పడే చట్టపరమైన అంతరాన్ని పూరించేందుకు మరియు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాలకు మార్చడంలో ఏకరూప ప్రక్రియను నెలకొల్పేందుకు ప్రధాన పట్టణాభివృద్ధి చట్టాలలో ఎక్సటర్నల్ డెవలప్‌మెంట్ చార్జీలను కలుపుతూ సవరణలు చేయడం జరుగుతుంది. ఈ సవరణల ద్వారా రాష్ట్రంలో ప్రధాన ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి అవసరమైన నిధుల సేకరణకు ఒక వ్యవస్థీకృత విధానం ఏర్పడి, పెద్ద రోడ్లు, ఫ్లైఓవర్లు, ప్రాంతీయ పార్కులు మరియు ఇతర నగర సౌకర్యాల అభివృద్ధికి సహాయపడుతుంది.
