మత్స్యకారులకు , ఆక్వా రంగానికి కూటమి ప్రభుత్వం పూర్తి అండ: మంత్రి డోలా.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ.సముద్రంలో వేటకు వెళ్లే ప్రతీ మత్స్యకారుడి ప్రాణ రక్షణ, వారి కుటుంబాల ఆర్థిక అభ్యున్నతే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ సంక్షేమ శాఖ మంత్రి డోలా. బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మత్స్యకారుల రక్షణార్థం ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్రాన్స్‌పాండర్లను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా శాటిలైట్ ట్రాన్స్‌పాండర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ పరికరాలను బోట్లలో ఉంచుకోవడం వల్ల సముద్రంలో ఏదైనా ప్రమాదం జరిగినా, ప్రతికూల వాతావరణం లేదా తుఫాను హెచ్చరికలు ఉన్నా, బోటు ప్రమాదవశాత్తూ పక్క దేశాల జలాల్లోకి వెళ్తున్నా బ్లూటూత్ ద్వారా మత్స్యకారుల స్మార్ట్‌ఫోన్‌లకు తక్షణ అలెర్ట్లు వస్తాయన్నారు. అత్యవసర సమయాల్లో మత్స్యకారులు ఎస్.ఓ.ఎస్ (SOS) సందేశాలను కంట్రోల్ రూమ్‌కు పంపి తమ ప్రాణాలను రక్షించుకోవచ్చని ఆయన వివరించారు. దీనికి తోడు వేటకు వెళ్లే ప్రతీ ఒక్కరికీ త్వరలోనే నాణ్యమైన లైఫ్ జాకెట్లను కూడా ప్రభుత్వం పంపిణీ చేయనుందని స్పష్టం చేశారు.
మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి, వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రూ. 20,000 ల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. అలాగే వారి కష్టాన్ని గుర్తించి 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేస్తుండటంతో పాటు, సబ్సిడీపై వలలు, బోట్లు అందజేస్తున్నామన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి దురదృష్టవశాత్తూ అదృశ్యమైన మత్స్యకారుల కుటుంబాలకు వేగంగా డెత్ సర్టిఫికెట్లు ఇప్పించి, వారి కుటుంబాలకు తక్షణమే పింఛన్ మరియు ప్రమాద సహాయాన్ని అందిస్తున్నామని మంత్రి తెలిపారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీని సులభతరం చేసేందుకు ప్రత్యేకంగా డీజిల్ బంకుల ఏర్పాటుకు కూడా అనుమతులు తెస్తున్నట్లు వెల్లడించారు.
మౌలిక వసతుల కల్పనపై మాట్లాడుతూ, సింగరాయకొండ ప్రాంత మత్స్యకారుల సౌకర్యార్థం నూతనంగా ఆధునిక చేపల మార్కెట్‌ను నిర్మించనున్నామని మంత్రి చెప్పారు. అలాగే ఈ ప్రాంతంలో నివసించే యానాది సామాజిక వర్గానికి అన్ని వసతులతో కూడిన శాశ్వత నివాస సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని మరియు మత్స్య పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు విశాఖపట్నం, భీమవరం ప్రాంతాలలో ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని, విశాఖ తీరంతో పాటు రాష్ట్రంలోని బీచ్‌లను పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. పేద ప్రజలు, పేదల ఆకలి తీర్చడానికి కూటమి ప్రభుత్వం రూ. 5 లకే కడుపునిండా పౌష్టికాహారాన్ని ఇచ్చే అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించిందని ఆయన కొనియాడారు. మత్స్యకార సోదరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో తాను ఎల్లప్పుడూ మీకు తోడు ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు.

