స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలి.
కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి– ఎమ్మెల్యే గౌతు శిరీష.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, ఆగస్టు 11:
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమన్వయంతో సన్నద్ధం కావాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు. మంగళవారం పలాసలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం పెంచుకోవాలని సూచించారు. గ్రామాలు, వార్డుల వారీగా ప్రజలతో మరింత మమేకమై పనిచేయాలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
అనంతరం కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘డోర్ టు డోర్’ కార్యక్రమంపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో, సమన్వయంతో పనిచేస్తూ కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని గౌతు శిరీష కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో నియోజకవర్గ పార్టీ నాయకులు, మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

