పీజీఆర్‌ఎస్ అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదేశం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
నియోజకవర్గ స్థాయిలో పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.
క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా అర్జీదారులకు పూర్తి సంతృప్తికరమైన న్యాయం జరగాలి.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)లో 222 అర్జీల స్వీకరణ.
మార్కాపురం, జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను అధికారులు ప్రత్యేక చొరవతో, అత్యంత వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండలాలు, క్షేత్రస్థాయిలో పరిష్కరించదగిన సమస్యలను అధికారులు నేరుగా పరిశీలించి, అర్జీదారుల సమక్షంలోనే పారదర్శకంగా పరిష్కరించాలని పేర్కొన్నారు.
ఒకే సమస్యపై ప్రజలు పదేపదే కలెక్టరేట్ చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదని, రీ-ఓపెన్ అర్జీలు రాకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉందని స్పష్టం చేశారు.
నియోజకవర్గ స్థాయి పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇది ఏమాత్రం తగదని హెచ్చరించారు. పనితీరు మారకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు.
స్వీకరించిన అర్జీల్లో సింహభాగం రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉన్నందున, రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా స్పందించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలన్నారు. ప్రజల సంతృప్తే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
మొత్తం 222 అర్జీల స్వీకరణ:
ఈ పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై మొత్తం 222 అర్జీలు నమోదయ్యాయి. వీటిలో:
రెవెన్యూ సంబంధిత అర్జీలు: 170
ఇతర శాఖల సంబంధిత అర్జీలు: 52
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, కనిగిరి ఆర్డీవో అజయ్ కుమార్, హౌసింగ్ పీడీ మోహన్ రావు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఖరీమ్, జిల్లా రవాణా శాఖ అధికారి రాంబాబు, ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి బాలాజీ నాయక్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావుతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నరు.
