విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఎం ఈ ఓ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
మార్కాపురం జిల్లా కంభం స్థానిక నాయక్ వీధి ఉర్దూ ప్రాధమిక పాఠశాలను ఎంఈఓ అబ్దుల్ సత్తార్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు పరిశీలించిన ఎంఈఓ తరగతి గదుల్లో విద్యార్థుల అభ్యసన స్థాయిని స్వయంగా పరిశీలించారు.
విద్యార్థులతో ముచ్చటిస్తూ పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి, చదవడం, రాయడం, విషయాలను అర్థం చేసుకోవడంలో ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకున్నారు.
విద్యార్థులు అభ్యసన నైపుణ్యాలలో వెనుకబడిన వారిని గుర్తించి, వారికి ప్రత్యేక బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ప్రతిరోజూ విద్యార్థుల హాజరును పర్యవేక్షిస్తూ, పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించాలి
ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అన్ని పాఠశాలల్లో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని ఎంఈఓ అబ్దుల్ సత్తార్ ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత, క్రమశిక్షణ వంటి విలువలను పెంపొందించేలా కార్యక్రమాలను రూపొందించాలని తెలిపారు.
స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించనున్న ఆటపాటలు, దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఎంఈఓ స్వయంగా పరిశీలించారు. విద్యార్థులు ఉత్సాహంగా నిర్వహించిన ప్రదర్శనలను అభినందించారు. కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని ఎంఈఓ పేర్కొన్నారు. విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు.
పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని, విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన మార్గదర్శకాలు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో సిఆర్పి మురళి, ప్రధానోపాధ్యాయులు త్రివిక్రమరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

