పలాసలో జీడి రంగానికి కొత్త ఊపు.



 పలాసలో జీడి రంగానికి కొత్త ఊపు.

ఉత్పత్తి మూడింతలు పెంపుతో విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటే లక్ష్యం: ఎమ్మెల్యే గౌతు శిరీష.

పలాస, జూలై 10: పలాస నియోజకవర్గంలో జీడి ఉత్పత్తిని గణనీయంగా పెంచడంతో పాటు విలువ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించే దిశగా శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో విస్తృతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సార్ కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే గౌతు శిరీష అధ్యక్షత వహించారు.

సమావేశంలో టెక్కలి ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్, పలాస కాజు మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లా శ్రీనివాసరావు, జీడి పరిశ్రమల యజమానులు, రైతు ప్రతినిధులు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీదారులు, ఎస్సార్ కంపెనీ ప్రతినిధులు పాల్గొని జీడి సాగు విస్తరణ, అధిక దిగుబడులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిశ్రమల అభివృద్ధి అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

జీడి ఉత్పత్తిలో విజయవంతమైన మహారాష్ట్రలోని రత్నగిరి, కేరళ రాష్ట్రాల్లో అమలవుతున్న సాగు విధానాలు, పరిశ్రమల నమూనాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం ఒక రైతు, ఒక పరిశ్రమ యజమాని, ఒక పారిశ్రామికవేత్తతో కూడిన బృందాన్ని ఆయా ప్రాంతాలకు పంపించి అక్కడి విధానాలను పరిశీలించి పలాసలో అమలు చేసే అవకాశాలను అధ్యయనం చేయనున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, పరిశ్రమల అభివృద్ధే స్థానిక యువతకు ఉపాధి అవకాశాల విస్తరణకు మార్గమని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహం ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని, వ్యవసాయం–పరిశ్రమలు సమాంతరంగా అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అన్నారు.

జీడితో పాటు జీడి తొక్క ద్వారా బై-ప్రొడక్ట్స్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎస్సార్ ( ESSAR )కంపెనీ ముందుకు రావడం శుభపరిణామమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ప్రణాళిక అమలైతే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పలాస జీడి పరిశ్రమకు మరింత గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సమావేశంలో తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త వెంకన్న చౌదరి, ఎస్సార్ (ESSAR)కంపెనీ ప్రతినిధులు సాయిక్ అప్పారావు, హృషికేశ్ పరంజిత్, అరుణ్ రంజన్, ఏఎంసీ చైర్మన్, పలాస కాజు పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, రైతులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post