శాస్త్రీయ విద్య, సమాన సమాజ నిర్మాణానికి విద్యార్థులు ఉద్యమించాలి.
కాశీబుగ్గలో ఘనంగా ప్రారంభమైన పీడీఎస్‌యూ రాష్ట్రస్థాయి విద్యా–వైజ్ఞానిక శిక్షణా తరగతులు.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.
కాశీబుగ్గ, జూలై 10: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్రస్థాయి విద్యా–వైజ్ఞానిక శిక్షణా తరగతులు శుక్రవారం కాశీబుగ్గలోని టీకేఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి హాజరైన ప్రతినిధుల సమక్షంలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కె. భాస్కర్ సంఘ జెండాను ఆవిష్కరించి శిక్షణా తరగతులను ప్రారంభించారు.
ప్రారంభోపన్యాసం చేసిన ఆంధ్ర యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ సూరప్పడు మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా ఉద్యమాలకు, శాస్త్రీయ ఆలోచనలకు కేంద్రబిందువుగా నిలిచిందన్నారు. దోపిడీ, పీడనలేని సమ సమాజ నిర్మాణానికి విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యా హక్కుల పరిరక్షణ కోసం విద్యార్థి ఉద్యమాలు బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కె. భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వినోద్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. విద్యా రంగంలో కేంద్రీకరణ, ప్రైవేటీకరణ విధానాలు ప్రభుత్వ విద్యను బలహీనపరుస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రేషనలైజేషన్ ప్రక్రియను నిలిపివేయాలని, జీవో నంబర్–77ను రద్దు చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్. రాజశేఖర్, ఎం. సునీల్, సహాయ కార్యదర్శులు అంకన్న, రాజేష్, నాని, వీరేంద్ర ప్రసాద్, లోకేష్, రాష్ట్ర కోశాధికారి మహేంద్రతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన సుమారు 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. న్యూ డెమోక్రసీ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, వివోడబ్ల్యూ, ఐఎఫ్‌టీయూ తదితర ప్రజా సంఘాల నాయకులు కూడా హాజరయ్యారు.
బాక్స్
ప్రధాన డిమాండ్లు
- పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
- రేషనలైజేషన్ ప్రక్రియను నిలిపివేయాలి.
- జీవో నంబర్–77ను రద్దు చేయాలి.
- ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి.
- ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి.


