పలాసలో కూటమి ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలపై వైఎస్సార్‌సీపీ మండిపాటు
పలాస మండలం, మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ నాయకుల సంయుక్త విలేకరుల సమావేశం.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, జూలై 25:
పలాస నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేసిందని పలాస మండలం, పలాస మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. శనివారం పలాసలో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో వారు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.
రోడ్డు ప్రమాద ఘటనను ఉద్దేశపూర్వకంగా హత్య కేసుగా చిత్రీకరించి కఠిన సెక్షన్లు నమోదు చేయడం రాజకీయ వేధింపుల్లో భాగమేనని నాయకులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్పలరాజు కుమారుడు ఆరావ్ వర్మ 108కు సమాచారం ఇచ్చి బాధితుడి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారని, మానవత్వంతో వ్యవహరించిన కుటుంబంపైనే అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమని అన్నారు.
సాధారణంగా బెయిల్ లభించే ప్రమాద కేసును హత్య కేసుగా మార్చి మాజీ మంత్రిని జైలుకు పంపడం చట్ట దుర్వినియోగానికి నిదర్శనమని విమర్శించారు. ఈ వ్యవహారంలో పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
డాక్టర్ సీదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి ఎదిగి రాష్ట్ర మంత్రిగా సేవలందించిన బీసీ నాయకుడని, ఆయన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే కుట్రపూరితంగా ఈ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. పలాస ప్రాంత అభివృద్ధికి కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, తాగునీటి పథకాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చిన నాయకుడిపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకే ఇటువంటి కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. జిల్లాలో ఇతర ప్రమాదాలపై స్పందించని ప్రభుత్వం, కేవలం అప్పలరాజు కుటుంబాన్నే లక్ష్యంగా చేసుకోవడం వెనుక రాజకీయ ఉద్దేశమే ఉందన్నారు.
తమ చర్యలు సరైనవేనని అధికార పార్టీ నాయకులు భావిస్తే ప్రజా తీర్పును ఎదుర్కొనేందుకు పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని, అధికారం శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు.
ఈ కేసులో న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, చట్టపరంగానూ, ప్రజాక్షేత్రంలోనూ పోరాటం కొనసాగిస్తామని పలాస మండలం, మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. సత్యమే గెలుస్తుందని, ప్రజలే తుది తీర్పు ఇస్తారని వారు అన్నారు.

