రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే గౌతు శిరీష.
ఆ నలుగురు ట్రస్ట్ సేవలు అభినందనీయం.. యువత మరింత ముందుకు రావాలి.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా అధికార ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, జూలై 4: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుందని, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు. ఆ నలుగురు ట్రస్ట్ 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పలాసలోని కాష్యూ లేబర్ అండ్ రైస్ మిల్లర్స్ లేబర్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన భారీ రక్తదాన శిబిరంలో ఆమె పాల్గొని స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో సేవాభావాన్ని పెంపొందించే కార్యక్రమాల్లో యువత చురుగ్గా పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రమాదాలు, అత్యవసర శస్త్రచికిత్సలు, ప్రసూతి చికిత్సలు వంటి క్లిష్ట పరిస్థితుల్లో రక్తమే ప్రాణాలను నిలబెడుతుందని పేర్కొన్నారు. రక్తదానం మహాదానమని, ప్రతి ఒక్కరూ ఏడాదికి కనీసం ఒకసారి రక్తదానం చేసి మరో నలుగురిని కూడా ఇందుకు ప్రోత్సహించాలని సూచించారు.
ఎనిమిదేళ్లుగా వేలాది మంది రోగులకు రక్తాన్ని అందిస్తూ మానవతా సేవలో ముందంజలో నిలిచిన ఆ నలుగురు ట్రస్ట్ సభ్యుల సేవలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
ట్రస్ట్ వ్యవస్థాపకులు పిచ్చుక పాపారావు, కోశాధికారి సానా ఈశ్వరరావు మాట్లాడుతూ.. ట్రస్ట్ స్థాపన నుంచి ఇప్పటివరకు 35 వేల మందికి పైగా అవసరమైన రక్తాన్ని సమకూర్చామని తెలిపారు. అలాగే ట్రస్ట్ నిర్వహిస్తున్న "ప్రజా అంబులెన్స్" సేవల ద్వారా 280 మందికి అత్యవసర వైద్య సహాయం అందించినట్లు వెల్లడించారు. ప్రజల సహకారంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, ట్రస్ట్ సభ్యులు, ప్రాణదాత బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, యువత, విద్యార్థులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

