అరుణోదయ నాగన్న మృతి.. సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటు.

అరుణోదయ నాగన్న మృతి.. సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటు.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా అధికార ప్రతినిధి శంకర్ తమ్మినాన.

పలాస, జూలై 3:

 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విప్లవ సాంస్కృతిక ఉద్యమంలో విశిష్ట సేవలు అందించిన అరుణోదయ నాగన్నగా పేరొందిన కామ్రేడ్ పరకాల నాగన్న మృతిపట్ల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

బాల్యం నుంచి చివరి శ్వాస వరకు విప్లవ సాంస్కృతిక ఉద్యమానికే జీవితాన్ని అంకితం చేసిన నాగన్న ఆట, పాట, మాటలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపారని జిల్లా అధ్యక్షుడు ఎస్. రామారావు, ప్రధాన కార్యదర్శి ఎస్. సోమేశ్వరరావు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఖమ్మంలోని తన నివాసంలో నాగన్న కన్నుమూశారని, ఆయన మరణం విప్లవ సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటని అన్నారు.

శ్రీకాకుళం రైతాంగ పోరాట చరిత్రను తన గాత్రంతో ప్రజల్లోకి తీసుకెళ్లి వేలాదిమందిని ఉత్తేజపరిచారని, ఉద్దానం ప్రాంత ప్రజా ఉద్యమాలకు కొత్త ఊపునిచ్చారని కొనియాడారు. ముఖ్యంగా సోంపేట, కాకరపల్లి ఉద్యమాల సందర్భంగా ఆయన రచించి ఆలపించిన పోరాట గీతాలు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాయని, అవి చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.

అరుణోదయ వ్యవస్థాపకుల్లో ఒకరైన నాగన్న ఆశయాలు, చూపిన మార్గంలోనే సంస్థ తన సాంస్కృతిక పోరాటాన్ని కొనసాగిస్తుందని, అదే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అవుతుందని జిల్లా కార్యవర్గం పేర్కొంది.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post