పలాస బీసీ బాలికల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ.
విద్యార్థినులకు మెరుగైన వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం: ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, జూలై 9:
పలాస పట్టణంలోని శివాజీనగర్‌లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ బాలికల పాఠశాలను ఏపీటీపీసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వజ్జ బాబూరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీలో పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న వసతులు, భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు.
పాఠశాల ఆవరణ పరిశుభ్రత, తరగతి గదుల నిర్వహణ, ప్రహరీ గోడ, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన బాబూరావు, విద్యార్థినుల భద్రత దృష్ట్యా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. అవి నిరంతరం పనిచేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బందితో సమావేశమైన ఆయన విద్యార్థినుల హాజరు, విద్యా ప్రమాణాలు, వసతి, భోజన ఏర్పాట్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


