విద్యా సమస్యల పరిష్కారానికి జూలై 13న కలెక్టరేట్ ముట్టడి.
మహాధర్నాను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ పిలుపు.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.
శ్రీకాకుళం, జూలై 9: రాష్ట్రంలో పేరుకుపోయిన విద్యా రంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 13న జిల్లా కలెక్టరేట్‌ల వద్ద నిర్వహించే మహాధర్నాను విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళంలోని క్రాంతి భవన్‌లో నిర్వహించిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి. సోమశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రవి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని, ప్రతి విద్యా సంవత్సరంలో ప్రారంభంలోనే కళాశాలల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లు గడుస్తున్నా ఆ హామీలను అమలు చేయలేదని ఆరోపించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు సుమారు రూ.10,700 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. గత, ప్రస్తుత విద్యా సంవత్సరాలకు సంబంధించిన తొమ్మిది క్వార్టర్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలుగా రూ.6,300 కోట్లు, స్కాలర్‌షిప్‌ల రూపంలో మరో రూ.2,200 కోట్లు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
2026-27 బడ్జెట్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి అవసరమైన నిధులు కేటాయించలేదని, ప్రతి ఏడాది కనీసం రూ.3,900 కోట్లు అవసరమవుతుండగా రూ.2,766 కోట్లు మాత్రమే కేటాయించడం వల్ల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. వసతి దీవెన పథకానికి కూడా పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయకుండా కేవలం పరిమిత మొత్తానికే ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విమర్శించారు.
రాష్ట్రంలో దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రయోజనాలకు దూరమవుతున్నారని, దీనివల్ల అనేక మంది ఉన్నత విద్యను మధ్యలోనే విరమించుకునే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యను హక్కుగా భావించి ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలన్నింటినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో కనీస మౌలిక వసతులు కూడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు పేర్కొన్నారు. తాగునీరు, పరిశుభ్రత, మరుగుదొడ్లు, పడక సామగ్రి, దుప్పట్లు, ట్రంక్ పెట్టెలు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా విద్యార్థులకు అందిస్తున్న మెస్ ఛార్జీలను పెంచకపోవడంతో పోషకాహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న వార్డెన్లు, కుక్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, సిబ్బంది కొరత కారణంగా విద్యార్థులే అనేక పనులు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జూలై 13న నిర్వహించే కలెక్టరేట్ మహాధర్నాలో విద్యార్థులు, యువజనులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు అశోక్, హర్షవర్ధన్, ఉదయ్, సాయి, భవాని తదితరులు పాల్గొన్నారు.
