చిమ్మచీకట్లో పలాస ప్రధాన రహదారి.. వీధిదీపాల లేమితో ప్రమాదాలకు ఆహ్వానం.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన
ప్రజల ప్రాణాలతో చెలగాటం.. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు
పలాస, జూలై 14:
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారులు వీధిదీపాల లేమితో రాత్రివేళ చిమ్మచీకట్లో మునిగిపోతుండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కోసంగిపురం సమీపంలోని జాతీయ రహదారి (ఎన్‌హెచ్) నుంచి పట్టణంలోకి వచ్చే సుమారు రెండు కిలోమీటర్ల ప్రధాన రహదారి పూర్తిగా అంధకారంలో ఉండటంతో ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రహదారిపై ఒక్క వీధిదీపం కూడా వెలగకపోవడంతో రాత్రి సమయంలో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులు తీవ్ర ఇబ్బందులతో ప్రయాణించాల్సి వస్తోంది. రోడ్డుపై గుంతలు, ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల చిన్నా, పెద్దా ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయని వాహనదారులు చెబుతున్నారు. ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ సమస్యపై పలుమార్లు స్థానికులు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, పత్రికల్లో కథనాలు వచ్చినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రత కంటే అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు.
ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, కోసంగిపురం–పలాస ప్రధాన రహదారిపై వీధిదీపాలను అత్యవసరంగా ఏర్పాటు చేసి రాత్రివేళ వెలిగేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు, వాహనదారులు మున్సిపల్ కమిషనర్‌ను కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదాలను నివారించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


